Harmanpreet Kaur : భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ కంటే మహిళల ప్రీమియర్ లీగ్(Women’s Premier League 2023) చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి కనబరిచారని అంది. ‘మహిళా క్రికెట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ఒక గేమ్ చేంజర్. ఆ టోర్నమెంట్ చాలా బాగా జరిగింది. భారత్‌లో ప్రతిఒక్కరూ ఆ లీగ్‌ను ఇష్టపడ్డారు. ఇక అభిమానుల స్పందన గురించి అయితే ఓ రేంజ్లో ఉంది.
నిజం చెప్తున్నా.. కొందరైతే ఐపీఎల్ కంటే మా లీగ్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. ఎందుకంటే..? ఇంతకుముందు మనదేశంలో ఇలాంటి టోర్నీ జరగలేదు’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. ఈ స్టార్ బ్యాటర్ చెప్పింది నిజమే. మామూలుగా అయితే.. మహిళల క్రికెట్ చూసేందుకు 9 వేల నుంచి 13 వేల మంది మాత్రమే స్టేడియానికి వచ్చేవాళ్లు. కానీ, మహిళల ప్రీమియర్ లీగ్ సమయంలో 30 వేల మంది ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు.
డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం
బీసీసీఐ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూపీఎల్‌లో మార్చి 4 న మొదలై, 26వ తేదీన ముగిసింది. మొత్తం ఐదు జట్లు పోటీపడిన ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడ్డాయి. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో ఢిల్లీని భారీ తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. యూపీ వారియర్స్ మూడు, గుజరాత్ జెయింట్స్ నాలుగు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో నిలిచాయి.
కూల్ కెప్టెన్‌గా పేరొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ బంగ్లాదేశ్ పర్యటనలో విమర్శల పాలైంది. టైగా ముగిసిన మూడో వన్డేలో ఆమె బ్యాట్‌తో వికెట్లను కొట్టడమే కాకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత ట్రోఫీ అందించే సమయంలోనూ బంగ్లా కెప్టెన్ షమీమా సుల్తానా(Shamima Sultana)తో అమర్యాదగా ప్రవర్తించింది. అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని మరోసారి ప్రస్తావించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్
ఐసీసీ రిఫరీ మ్యాచ్ ఫీజులో భారీ కోతతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అంతేకాదు నాలుగు డీ మెరిట్ పాయింట్లు కూడా కేటాయించారు. దాంతో, ఆసియా గేమ్స్(Asian Games 2023)లో భారత కెప్టెన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ భారత జట్టు సెమీస్ చేరితే తప్ప హర్మన్‌ప్రీత్ బరిలోకి దిగే అవకాశం లేదు. దాంతో, టీమిండియా కప్పు కొడుతుందా? లేదా? అని కోట్లాది మంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు.