ముంబై : భారత మహిళా క్రికెట్లో ఏండ్లుగా ఊరిస్తున్న తొలి ఐసీసీ ట్రోఫీని ఈసారి స్వదేశంలో తప్పక సాధిస్తామని టీమ్ఇండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే ఈ మెగా టోర్నీకి ‘50 రోజుల కౌంట్‌డౌన్’ సందర్భంగా ముంబైలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ ‘సొంత అభిమానుల ఎదుట ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. భారతీయులందరూ ఎంతోకాలంగా వేచి చూస్తున్న లోటు (ఐసీసీ ట్రోఫీ)ను ఈసారి పూరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రపంచకప్‌లు ఎప్పటికీ ప్రత్యేకం. దేశం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయడం గర్వంగా ఉంటుంది’ అని తెలిపింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ 2005, 2017లో ఫైనల్ చేరినా రెండు సందర్భాల్లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
ప్రపంచకప్ కంటే ముందే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్ తమ ముందున్న సవాల్ అని హర్మన్‌ప్రీత్ చెప్పింది.ఈ సిరీస్ గెలవడం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆమె అభిప్రాయపడింది. స్మృతి మాట్లాడుతూ.. ‘గత కొన్నాళ్లుగా భారత్‌లో మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. ప్రపంచకప్ విషయానికొస్తే మేం బాగా ప్రిపేర్ అవుతున్నాం. శిక్షణా శిబిరాల్లో మా లోపాలను చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నాం. అభిమానుల మద్దతు మాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది. ఈ కార్యక్రమంలో ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో పాటు మాజీ సారథి మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు.