Hardik Pandya : టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న. అదేంటి?.. అతనికి మూడేళ్ల క్రితమే మోడల్, నటి నటాషా స్టాంకోవిక్‌తో వివాహం అయింది కదా!, ఈ జంటకు రెండున్నర ఏళ్ల అగస్త్య అనే బాబు కూడా ఉన్నాడు కదా! అని ఆశ్చర్యపోతున్నారా!.. అయితే.. మీరు పొరబడినట్టే.. అతను పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు. తన భార్య నటాషానే. హార్ధిక్ – నటాషా మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అని షాక్ అవుతున్నారా!.. అయితే.. ఈ స్టోరీ చదవండి.
హార్ధిక్ – నటాషాలు 2020 మే 31న ఒక కోర్టులో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే.. అప్పుడు పరిస్థితులు బాగా లేవు. కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఆ రోజు నుంచి వాళ్ల మనసులో ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయంగా, వైభవంగా వివాహం చేసుకోవాలని ఉంది. జీవితంలో మర్చిపోలేని పెళ్లి రోజును జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని అనకున్నారు. అందుకని హార్దిక్ – నటాషా జోడీ వచ్చే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. వీళ్ల వివాహ తంతు ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 16 వరకు జరగనుందని సమాచారం. ఈ నాలుగు రోజల్లో హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారట. అయితే.. ఈ విషయమై హార్ధిక్ – నటాషా ఇంకా స్పందించాల్సి ఉంది.
నటాషా సొంత దేశం సెర్బియా. ఆమె 2012లో ఇండియాకు వచ్చింది. బాలీవుడ్లో మోడల్, డ్యాన్సర్, నటిగా రాణించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు వెండితెర మీద నటించే అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలతోనూ నటాషా నటించింది. ముంబై నైట్ క్లబ్లో హార్దిక్ పాండ్యా, నటాషా కలిశారు. నటాషాను చూడగానే హార్ధిక్ ప్రేమలో పడిపోయాడట. ఆ తర్వాత నటాషా కూడా ఈ ఆల్‌రౌండర్‌పై మనసు పడింది. కొన్నాళ్లు వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారు. 2020 జనవరి 1న హార్దిక్, నటాషాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఈ జంట 2020లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లితో ఒక్కటైంది. వీళ్లకు అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.