Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్, వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు. గతేడాది అక్టోబర్ – నవంబర్‌లో భారత్ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో పూణేలో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. వరల్డ్ కప్‌లో గాయం అనంతరం క్రికెట్‌కు దూరమైన పాండ్యా.. తర్వాత ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌లకూ దూరమయ్యాడు. త్వరలో అఫ్గానిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్ లోనూ అతడు ఆడటం అనుమానమే అని ఇదివరకే బీసీసీఐ ప్రతినిధులు తేల్చి చెప్పారు. అయితే మార్చిలో మొదలుకాబోయే ఐపీఎల్ – 17వ సీజన్ వరకైనా పాండ్యా రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
హార్ధిక్ పాండ్యా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోను పోస్ట్ చేస్తూ పాండ్యా… ‘ప్రోగ్రెస్, ఎవ్రీడే’ అని క్యాప్షన్ పెట్టాడు. వాస్తవానికి పాండ్యా అఫ్గానిస్తాన్ సిరీస్ వరకే తిరిగి జట్టుతో చేరతాడని గతంలో వార్తలు వచ్చినా జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో అతడు పూర్థిస్థాయి ఫిట్నెస్ సాధించిన తర్వాతే రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ వరకు కూడా అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటాడో లేదోననేది అనుమానంగానే ఉంది.
ఐపీఎల్లో రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన హార్ధిక్.. ఈ సీజన్ నుంచి తిరిగి తన మాతృ జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నాడు. ఈ మేరకు ముంబై జట్టు పాండ్యాకు రూ. 100 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నట్టూ గుసగుసలు వినిపించాయి. రెండేండ్ల పాటు గుజరాత్‌కు ఆడిన పాండ్యా.. 31 మ్యాచ్‌లలో 37.86 సగటుతో 833 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ముంబై తరఫున 2015 నుంచి 2021 దాకా ఆడిన పాండ్యా.. 1,476 పరుగులు చేశాడు. ముంబై 2015, 2017, 2019, 2020లలో ట్రోఫీలు గెలవగా ఈ విజయాలలో హార్ధిక్.. మరో ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌తో కలిసి కీలక పాత్ర పోషించాడు.