బతుమి(జార్జియా): ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ పోరులో డ్రాల పర్వం కొనసాగుతున్నది. ఆదివారం భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగిన రెండో గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో క్లాసిక్ విభాగంలో రెండు గేములు పూర్తయ్యే సరికి హంపి, దివ్య స్కోరు 1-1తో సమైమైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రెండో గేమ్ 34 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు సోమవారం జరిగే టైబ్రేక్‌లో హంపి, దివ్య అమీతుమీ తేల్చుకోనున్నారు. గేమ్ విషయానికొస్తే ఓవైపు వెటరన్ ప్లేయర్ హంపి తెల్లపావులతో బరిలోకి దిగగా, ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య ఆది నుంచే దూకుడు కనబరిచింది.
క్వీన్ పాన్‌తో దాడిని ప్రారంభించిన దివ్య ఒకింత ఇబ్బంది ఎదుర్కొంది. అయితే ఎదురుదాడి చేసే ప్రయత్నంలో పాన్‌ను వదిలిపెట్టుకున్న హంపి..ఈ క్రమంలో రెండు బిషప్‌లను కోల్పోయింది. తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో పాన్‌ను తిరిగి దక్కించుకున్న హంపికి దివ్య పదే పదే చెక్‌తో గేమ్‌ను రసవత్తరంగా మారింది. అయితే మధ్యేమార్గంగా ఇద్దరు 34 ఎత్తుల వద్ద డ్రాకు అంగీకరించడంతో పోరు ముగిసింది. సోమవారం ఇద్దరి మధ్య టైబ్రేక్ పోరు 15 నిమిషాల చొప్పున రెండు గేములు జరుగనున్నాయి.