కాటారం, అక్టోబర్ 22: ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థి సున్నం చరణ్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ అండర్-17 విభాగంలో చరణ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి టోర్నీలో చరణ్ ప్రాతినిధ్యం వహిస్తాడని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జైపాల్, పెటా సంఘం అధ్యక్షుడు రమేశ్, కాటారం జోన్ కార్యదర్శి విజయలక్ష్మి, కన్వీనర్ రాధ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన చరణ్‌ను బుధవారం గురుకులంలో ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్ అభినందనలు తెలిపారు.