జడ్చర్ల, డిసెంబర్ 16: అండర్-14 బాలుర వన్డే నాకౌట్ క్రికెట్ టోర్నీలో గున్న కేతన్‌కుమార్ యాదవ్ సత్తా చాటాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో సోమవారం సెయింట్ ఆంటోనీ హైస్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ బ్యాటర్ కేతన్ డబుల్ సెంచరీ(136 బంతుల్లో 235, 26ఫోర్లు, సిక్స్)తో కదంతొక్కాడు. కెప్టెన్ కేతన్ ద్విశతకం ధాటికి మహబూబ్‌నగర్ 47 ఓవర్లలో 468/3 భారీ స్కోరు సాధించింది. కేతన్‌తో పాటు శ్రీహర్షిత్(75 నాటౌట్), ఆకారం హర్షిత్(62), సాయిరాం(32), మాలిమ్ అర్హన్(30) రాణించగా, 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంటోనీ హైస్కూల్..మహబూబ్‌నగర్ బౌలర్ల ధాటికి 11.1 ఓవర్లలో కేవలం 23 పరుగులకే కుప్పకూలి 445 పరుగుల తేడాతో భారీ ఓటమి మూటగట్టుకుంది. ఇందులో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే రాగా, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సోహైల్ 7 వికెట్లతో విజృంభించాడు.కేతన్ ప్రస్తుతం జడ్చర్ల స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.