సింగపూర్ : దొమ్మరాజు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య సింగపూర్ వేదికగా హోరాహోరీగా జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డ్రా ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం జరిగిన ఏడో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. ఏకంగా ఐదు గంటల పాటు మారథాన్ మ్యాచ్ ఆడిన గుకేశ్, లిరెన్ గెలుపు కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోరాడారు. చివరికి 72 ఎత్తుల తర్వాత ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. ఈ టోర్నీలో ఇది ఐదో డ్రా కాగా వరుసగా నాలుగోవది. ఏడో గేమ్ సైతం డ్రాగా తేలడంతో ఇరువురూ 3.5 పాయింట్లతో సమంగా నిలిచారు.
ఒక రోజు విరామం తర్వాత జరిగిన ఏడో మ్యాచ్లో గుకేశ్ తెల్లపావులతో ఆడాడు. ఆరంభం నుంచే తెలివిగా పావులు కదుపుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. అతడి ఎత్తులకు బదులిచ్చేందుకు లిరెన్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకదశలో గుకేశ్ మ్యాచ్ను సొంతం చేసుకునేటట్లు కనిపించాడు. కానీ ఆఖర్లో లిరెన్ చేసిన తప్పిదాలను సద్వినియోగం చేసుకోవడంలో గుకేశ్ సఫలీకృతం కాలేకపోయాడు. బుధవారం ఈ ఇద్దరి మధ్య 8వ గేమ్ జరుగనుంది.