వార్సా (పోలండ్): ఇటీవలి కాలంలో వరుస పరాభవాలతో సతమతమవుతున్న వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వల్ప విరామం తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. వార్సా వేదికగా గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో రెండు విజయాలతో సత్తాచాటాడు. ర్యాపిడ్ విభాగం ఐదో రౌండ్లో అతడు.. ఉజ్బెకిస్థాన్ సంచలనం జవోఖిర్ సిందరోవ్‌ను ఓడించాడు.
నల్లపావులతో ఆడిన గుకేశ్.. 52 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. అంతకుముందు అతడు.. మూడో రౌండ్లో పోలండ్కే చెందిన జాన్ క్రిస్టోఫ్‌తో గేమ్‌ను గెలుచుకోగా అలిరెజా (ఫ్రాన్స్), వెస్లీ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లను డ్రా చేసుకున్నాడు. పది మంది ప్లేయర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఆరు రౌండ్లు ముగిసేసరికి 6 పాయింట్లతో గుకేశ్ మూడో స్థానంలో ఉన్నాడు.