IPL | బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి సొంతగడ్డపై చుక్కెదురైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా దూసుకెళుతున్న ఆర్సీబీకి గుజరాత్ టైటాన్స్(జీటీ) బ్రేక్‌లు వేసింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జీటీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. లివింగ్స్టన్(40 బంతుల్లో 54, ఫోర్, 5సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ (3/19), సాయికిషోర్ (2/22) అదరగొట్టారు. ముఖ్యంగా సిరాజ్.. సాల్ట్ (14), పడిక్కల్ (4), లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. లక్ష్యఛేదనను గుజరాత్ 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. బట్లర్(39 బంతుల్లో 73 నాటౌట్, 5ఫోర్లు, 6సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో చెలరేగగా, సుదర్శన్ (49), రూథర్‌ఫర్డ్(30 నాటౌట్) ఆకట్టుకున్నారు. భువనేశ్వర్ (1/23), హాజిల్‌వుడ్(1/43) ఒక్కో వికెట్ తీశారు. సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
బట్లర్ బాదేశాడు : భారీ మెరుపులేమీ లేకపోయినా ఛేదనలో గుజరాత్ ఇన్నింగ్స్ వేగంగానే మొదలైంది. ఓ సిక్స్, బౌండరీతో టచ్‌లోనే కనిపించిన సారథి గిల్ (14).. భువనేశ్వర్ ఐదో ఓవర్లో లివింగ్‌స్టన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. మరో ఎండ్‌లో సుదర్శన్ వేగంగా ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డాడు. గిల్ నిష్క్రమణతో వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్.. రసిక్ సలమ్ 9వ ఓవర్లో గేర్ మార్చి 4, 6, 6 బాది టైటాన్స్ ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. బట్లర్ స్ఫూర్తితో సుదర్శన్ కూడా కృనాల్ 12వ ఓవర్లో రెండు బౌండరీలు రాబట్టాడు. 13వ ఓవర్లో బంతిని మార్చడం బెంగళూరుకు కలిసొచ్చింది. హేజిల్‌వుడ్ ఓవర్లో సుదర్శన్.. అనవసరపు షాట్ ఆడి జితేశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పరుగు తేడాతో సుదర్శన్ అర్ధసెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. సుదర్శన్ స్థానంలో క్రీజులోకొచ్చిన రూథర్‌ఫర్డ్..బట్లర్‌కు జతకలిశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన బట్లర్..బెంగళూరు బౌలర్లను ఆటాడుకున్నాడు. లివింగ్స్టన్ 15వ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో బట్లర్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో వికెట్ పడకుండానే బట్లర్, రూథర్‌ఫర్డ్ గుజరాత్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఓపెనర్లపై అతిగా ఆధారపడి వాళ్లు విఫలమైతే ఏం జరుగుతుందో బెంగళూరుకు మూడో మ్యాచ్‌లోనే తెలిసొచ్చింది. 38/3.. తొలి పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోరిది. గత రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు పవర్ ప్లే (కోల్‌కతాపై 80/0, చెన్నైపై 56/1)లోనే ప్రత్యర్థులపై విరుచుకుపడినా సొంతగడ్డపై మాత్రం తేలిపోయింది. రెండో ఓవర్లో కోహ్లీ నిష్క్రమించాడో లేదో ఆ జట్టు టాపార్డర్ పెవిలియన్‌కు క్యూకట్టింది. అర్షద్ ఖాన్ (1/17) రెండో ఓవర్లో నాలుగో బంతిని బ్యాక్వర్డ్ స్కేర్ దిశగా షాట్ ఆడబోయిన కోహ్లీ.. అక్కడే ఉన్న ప్రసిధ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత సిరాజ్ వరుస ఓవర్లలో.. పడిక్కల్ (4), సాల్ట్ (14)ను ఔట్ చేసి బెంగళూరును ఒత్తిడిలోకి నెట్టాడు. 7వ ఓవర్లో బౌలింగ్ మార్పుగా వచ్చిన ఇషాంత్ శర్మ (1/27).. కెప్టెన్ రజత్ పటిదార్ (12)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో బెంగళూరు కష్టాలు రెట్టింపయ్యాయి.
42 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును జితేశ్, లివింగ్స్టన్ ఆదుకున్నారు. ఇషాంత్ 9వ ఓవర్లో జితేశ్.. 6, 4, 4తో ఎదురుదాడికి దిగాడు. కానీ సాయికిషోర్ 13వ ఓవర్లో తెవాటియా చేతికి చిక్కడంతో 52 బంతుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కృనాల్ (5) సైతం నిరాశపరిచాడు. ఆరంభంలో తన శైలికి భిన్నంగా ఆడిన లివింగ్స్టన్.. రషీద్ ఖాన్ 18వ ఓవర్లో 6, 6, 6తో గేర్ మార్చి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో బెంగళూరు పోరాడగలిగే స్కోరును సాధించింది.
బెంగళూరు: 169/8 (లివింగ్స్టన్ 54, జితేశ్ 33, సిరాజ్ 3/19, సాయి 2/22);
గుజరాత్: 17.5 ఓవర్లలో 170/2(బట్లర్ 73 నాటౌట్, సుదర్శన్ 49,భువనేశ్వర్ 1/23, హాజిల్‌వుడ్ 1/43)