అహ్మదాబాద్ : ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50 బంతుల్లో 86, 8ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కోల్‌కతా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్ బౌండరీలతో దుమ్మురేపాడు. చక్రవర్తి(2/34) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తొలుత కేకేఆర్.. నిర్ణీత ఓవర్లలో 180 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్న పాతిక కోట్ల ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (55 బంతుల్లో 79, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఎట్టకేలకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో నైట్‌రైడర్స్ గౌరవప్రదమైన స్కోరుచేయగల్గింది. రబాడ(3/29), సిరాజ్(2/23) రాణించారు.
సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్ వైఫల్యాలతో నిరాశపరుస్తున్న కోల్”కథ’.. అహ్మదబాద్లోనూ మారలేదు. విధ్వంసకర ఓపెనర్ అలెన్‌ను కాదని సీఫర్ట్ (19)ను ఆడించినా ఫలితంలో మార్పు లేదు. సారథిగానే గాక బ్యాటర్‌గానూ విఫలమవుతున్న రహానే.. సిరాజ్ తొలి ఓవర్లో ఎదుర్కున్న మొదటి బంతికే సున్నాచుట్టగా ఫామ్‌లో ఉన్న రఘువంశీ (8), రబాడా బౌలింగ్‌లో కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు. రెండు బౌండరీలు, ఒక ఫోర్ బాదిన సీఫర్ట్‌ను రబాడా పెవిలియన్‌కు పంపడంతో పవర్ ప్లేలో ఆ జట్టు 37/3తో నిలిచింది. ఈ దశలో గ్రీన్‌కు జతకలిసిన పావెల్ (27) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. జీటీ బౌలర్లపై పావెల్ ఎదురుదాడికి దిగగా గ్రీన్ మాత్రం ఆచితూచి ఆడాడు. నాలుగో వికెట్‌కు 55 పరుగులు జతచేసిన ఈ జోడీని.. 11వ ఓవర్లో అశోక్ శర్మ విడదీశాడు. పావెల్ నిష్క్రమించాక బాదుడు బాధ్యతను గ్రీన్ భుజానికెత్తుకున్నాడు. రషీద్ ఓవర్లో 6, 4 బాదిన అతడు.. అశోక్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో ఈ సీజన్లో తన తొలి అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. అనుకుల్ (9)తో ఐదో వికెట్‌కు 60 రన్స్ జోడించడంతో 14.3 ఓవర్లకు కేకేఆర్ 145/4తో పటిష్ట స్థితిలోనే కనబడింది. కానీ ప్రసిద్ధ్.. అనుకుల్‌ను ఔట్ చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. రింకూ (1), రమణ్‌దీప్ (17), నరైన్ తేలిపోయారు. చివరి 4 ఓవర్లలో ఆ జట్టు 32 రన్స్ మాత్రమే చేసి ఐదు వికెట్లను చేజార్చుకుంది.
సాయి సుదర్శన్ (22), కెప్టెన్ గిల్ మెరుపులు మెరిపించడంతో ఛేదనను జీటీ ధాటిగా ఆరంభించింది. అనుకుల్ మూడో ఓవర్లో 20 రన్స్ రాబట్టిన ఈ జోడీ.. కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా బౌలింగ్‌లోనూ దూకుడు ప్రదర్శించడంతో టైటాన్స్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో సాయిని నరైన్ ఔట్ చేసినా మూడో స్థానంలో వచ్చిన బట్లర్ (25) ఆరంభం నుంచే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ 8ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన బట్లర్.. అతడే వేసిన పదో ఓవర్లో తొలి బంతికి లాంగాన్‌లో గ్రీన్ చేతికి చిక్కడంతో జీటీ రెండో వికెట్ కోల్పోయింది. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్.. నరైన్ ఓవర్లో సింగిల్‌తో మరో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. సాయితో తొలి వికెట్‌కు 57, బట్లర్‌తో రెండో వికెట్‌కు 38 రన్స్ జతచేసిన అతడు.. మూడోవికెట్‌కు వాషింగ్టన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫిఫ్టీ తర్వాత జోరు పెంచి భారీ షాట్లతో విరుచుకుపడ్డ జీటీ సారథి…లక్ష్యం దిశగా పయనించాడు. సాఫీగా సాగుతున్న సమయంలో అరోరా బౌలింగ్‌లో గ్రీన్ సూపర్ క్యాచ్‌తో గిల్ ఔటయ్యాడు. ఫిలిప్స్(19) ఔటైనా..తెవాటియా(7 నాటౌట్), షారుక్‌ఖాన్(0 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

కోల్‌కతా: 20 ఓవర్లకు 180 ఆలౌట్ (గ్రీన్ 79, పావెల్ 27, రబాడా 3/29, సిరాజ్ 2/23);
గుజరాత్: 19.4 ఓవర్లలో 181/5(గిల్ 86, బట్లర్ 25, చక్రవర్తి 2/34, రమణ్‌దీప్ 1/5)