Gujarat Cricket Association : ప్రపంచవ్యాప్తంగా ఏడాది పొడవునా టీ20 లీగ్స్(T20 Leagues) జరుగుతూనే ఉన్నాయి. ఐపీఎల్(IPL) సూపర్ హిట్ కావడంతో పొట్టి క్రికెట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల బోర్డులు కూడా టీ20 లీగ్స్ జరుపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘాలు ఈ లీగ్స్ నిర్వహిస్తున్నాయి. త్వరలోనే ఈ జాబితాలో గుజరాత్ క్రికెట్ సంఘం(GCA) కూడా చేరనుంది.
తమ రాష్ట్రంలోని యువతను వరల్డ్ క్లాస్ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న జీసీఏ టీ20 లీగ్ ప్రారంభానికి సన్నాహకాలు చేస్తోంది. ‘గుజరాత్లో టీ20 ఫ్రాంచైజీ లీగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. 2025-26 ఎడిషన్‌గా లీగ్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం. అయితే.. ఎన్ని జట్లతో టోర్నీ నిర్వహించాలి? ఏయే వేదికలు అనువైనవి? వంటి విషయాలపై చర్చిస్తున్నాం. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని జీసీఏ సెక్రటరీ అనిల్ పటేల్ (Anil Patel) శుక్రవారం క్రిక్‌బజ్‌కు సమాచారమిచ్చాడు.
ఐపీఎల్ ఆరంభంతో పొట్టి క్రికెట్ రాతే మారిపోయింది. 2008లో మొదలైన ఈటోర్నీ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 ఫ్రాంచైజీ లీగ్‌లో ఒకటి. దాంతో.. పలు రాష్ట్రాలు సొంతంగా ఫ్రాంచైజీ లీగ్స్ నిర్వహిస్తున్నాయి. తద్వారా యువ క్రికెటర్లకు ఐపీఎల్, టీమిండియాకు ఆడేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ మధ్యే విదర్భ కూడా పొట్టి లీగ్‌కు పచ్చజెండా ఊపేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ క్రికెట్ సంఘం సైతం టీ20లీగ్‌తో స్థానికులను అలరించాలని భావిస్తోంది.