అహ్మదాబాద్ : ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ కొట్టిన ఆఖరి పంచ్‌కు 19వ సీజన్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఆ జట్టు గురువారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో టైటాన్స్ చేతిలో చిత్తయింది. దాంతో సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్న చెన్నై ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. మరోవైపు వరుసగా ఐదు విజయాల తర్వాత గత పోరులో కోల్‌కతా చేతిలో ఓడిన టైటాన్స్.. సీఎస్కేపై భారీ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. తొలుత సాయి సుదర్శన్ (53 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లతో 84), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లతో 64), బట్లర్(27 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లతో 57 నాటౌట్), అర్ధసెంచరీలతో గుజరాత్ 20 ఓవర్లలో 229/4 స్కోరు చేసింది. అనంతరం మహ్మద్ సిరాజ్ (3/26), రబాడ (3/32), రషీద్ ఖాన్ (3/18) బౌలింగ్ దెబ్బకు సీఎస్కే 13.4 ఓవర్లలో 140 రన్స్‌కే ఆలౌటైంది. శివం దూబే (17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారీ లక్ష్య ఛేదనలో చెన్నై ఘోరంగా తడబడింది. కొత్త బాల్‌తో మహ్మద్ సిరాజ్ ఆ జట్టు టాపార్డర్ నడ్డి విరిచాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ (0)ను గోల్డెన్ డకౌట్ చేసిన తర్వాత సీఎస్కే కోలుకోలేకపోయింది. మూడో ఓవర్లో సిరాజ్ ఆ జట్టుకు డబుల్ షాకిచ్చాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన కెప్టెన్ రుతురాజ్ (16)నుక్లీన్బౌల్డ్ చేయడంతో పాటు యంగ్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (0)ను డకౌట్ చేసి 29/3తో కష్టాల్లోకి నెట్టాడు.మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ (24) ఎదురుదాడికి దిగి కొన్ని భారీ షాట్లు కొట్టాడు. కానీ, ఆరో ఓవర్లో రబాడ దెబ్బకు అతను కూడా పెవిలియన్ చేరగా.. కాసేపటికే గిల్ కొట్టిన డైరెక్ట్ త్రోకు కార్తీక్ శర్మ (19) రనౌటవ్వడంతో చెన్నై 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఈ దశలో హిట్టర్ శివం దూబే అనూహ్యంగా విజృభించాడు. భారీ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్లో 6, 4,4 కొట్టిన అతను హోల్డర్‌ను 6.4,6తో శిక్షించాడు. రషీద్ బౌలింగ్‌లోనూ భారీ సిక్స్ కొట్టిన అతను మరో షాట్‌కు ట్రై చేసి గిల్ అందుకున్న మెరుపు క్యాచ్‌తో ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ రాబట్టిన అన్షుల్ కాంబోజ్ (19)తో పాటు డెవాల్డ్ బ్రెవిస్ (8)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన రషీద్ గుజరాత్ విజయం ఖాయం చేశాడు. 14వ ఓవరో మిగిలిన రెండు వికెట్లు పడగొట్టిన రబాడ మ్యాచ్ ముగించాడు.
సూపర్ ఫామ్‌లో టైటాన్స్ టాపార్డర్ త్రయం సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్, బట్లర్ మరోమారు బ్యాట్లు ఝులిపించారు. సుదర్శన్, గిల్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఓవర్‌కు రన్‌రేట్ 10కి తగ్గకుండాబ్యాటింగ్ కొనసాగించారు. వరుసగా బౌండరీలు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. బౌలింగ్ మార్పుగా నూర్ అహ్మద్ లక్ష్యంగా గిల్ రెండు భారీ సిక్స్‌లు బాది 23 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అప్పటి వరకు గిల్‌కు చక్కని సహకారం అందించిన సుదర్శన్ తన బ్యాటుకు పనిచేబుతూ కంబోజ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో పోటీలోకి వచ్చాడు. ఈ జోడీని విడదేసేందుకు పార్ట్‌టైమ్ బౌలర్ శివమ్ దూబే ప్రయోగం కూడా బెడిసికొట్టింది. దూబే వేసిన 10వ ఓవర్లో సుదర్శన్ ఫోర్కు గిల్ మరో రెండు ఫోర్లు బాదటంతో 15 పరుగులు వచ్చి చేరాయి. ఈ క్రమంలో 35 బంతుల్లో సుదర్శన్ ఫిఫ్టీ అందుకోగా , జాన్సన్ 13వ ఓవర్లో దూబే సూపర్ క్యాచ్‌తో గిల్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌పడింది. క్రీజులోకి వచ్చి రావడంతోనే బట్లర్ ఫోర్‌తో ఖాతా తెరిచాడు. ఇక్కణ్నుంచి సుదర్శన్, బట్లర్ పోటీపడి బౌండరీలు బాదడంతో 18 ఓవర్లు ముగిసే సరికి జీటీ 200 పరుగులకు చేరుకుంది. కంబోజ్ 19వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన సుదర్శన్..రెండో బంతికి వెనుదిరుగగా, తెవాటియా(0) రనౌటయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..బట్లర్ తన పని కానిస్తూ అర్ధ సెంచరీ పూర్తిచేసుకోవడంతో పాటు జట్టుకు భారీ స్కోరు అందించాడు.
గుజరాత్: 20 ఓవర్లలో 229/4(సుదర్శన్ 84, గిల్ 64, ముకేశ్ 1-36, జాన్సన్ 1/47);
చెన్నై: 13.4 ఓవర్లలో 140 ఆలౌట్ (దూబే 47, షార్ట్ 24, సిరాజ్ 3/26, రషీద్ 3/18)
