GST On Sports | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (GST) విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పన్నుల విధానాన్ని సరళతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నాలుగు శ్లాబులను కేవలం రెండు శ్లాబులకు కుదిరించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక తీసుకున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న 12శాతం, 28శాతం శ్లాబులను తొలగించారు. ఇకపై 5శాతం, 18శాతం జీఎస్టీ శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొత్త జీఎస్టీ శ్లాబులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంత వరకు ఊరట కలిగినా.. దేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెట్‌పై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై ఏకంగా 40శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి క్రికెట్ ఈవెంట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇకపై ఐపీఎల్ స్పోర్ట్స్ ఈవెంట్ల టికెట్ల విక్రయాలపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. దాంతో టికెట్ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. దాంతో ప్రేక్షకుల జేబులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే, 40శాతం రేటు ఐపీఎల్ వంటి ఈవెంట్లకు మాత్రమే వర్తించనున్నది. మరోవైపు, గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఈవెంట్లపై ఈ భారీ పన్ను విధించే అవకాశం లేదు. గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఈవెంట్‌కు టికెట్ రూ.500 వరకు ఉంటే.. గతంలో మాదిరిగానే జీఎస్టీ ఉండదు. రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 18 శాతం చొప్పున జీఎస్టీ కొనసాగుతుంది. అంటే, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా టోర్నమెంట్ల ప్రేక్షకులపై ఎటువంటి అదనపు భారం ఉండదన్న మాట.
బెట్టింగ్, జూదం, లాటరీ, గుర్రపు పందెం, ఆన్లైన్ మనీ గేమింగ్ వంటి కార్యకలాపాలను 40 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ రంగాల వ్యాపారాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనున్నది. అయితే, జీఎస్టీ స్లాబ్‌లో మార్పుల కారణంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజ్ ఆధారిత ఈవెంట్లు ఖరీదైనవి మారనుండగా.. గుర్తింపు పొందిన ఈవెంట్లలో పాల్గొనే ప్రేక్షకులకు మాత్రం ఉపశమనం కలుగనున్నది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా ఒక కీలకమైన అడుగు అని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో, ప్రేక్షకుల భాగస్వామ్యం, ఐపీఎల్‌లాంటి ఈవెంట్ల ప్రజాధారణపై ప్రభావం కనిపిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.