మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ ఘనంగా మొదలైంది. మొదటి రోజు సంచలనాలేమీ నమోదుకాకపోయినా స్టార్ ప్లేయర్లు తమ తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి రెండో రౌండ్‌కు చేరారు. 22 ఏండ్ల వయసులోనే ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ఇంతవరకూ చిక్కని ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’పై కన్నేసిన స్పెయిన్ నయా బుల్ కార్లొస్ అల్కరాజ్ ఆ దిశగా మొదటి అడుగును ఘనంగా వేశాడు. మహిళల సింగిల్స్‌లో బెలారస్ బామ అరీనా సబలెంకాతో పాటు ఇతర ప్లేయర్లూ అలవోక విజయాలు సాధించారు.
మెల్బోర్న్లోని ప్రఖ్యాత రాడ్లీవర్ ఎరీనా వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ అల్కరాజ్.. 6-3, 7-6 (7/2) 6-2తో ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా)పై సునాయసంగా గెలిచాడు. రెండు గంటల పాటు జరిగిన పోరులో వరుస సెట్స్‌ను గెలుచుకున్న కార్లొస్.. 8 ఏస్‌లు సంధించి 38 విన్నర్లు కొట్టాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-7 (1/7), 6-1, 6-4, 6-2తో గాబ్రియెల్ (కెనడా) పై గెలిచాడు. అమెరికా ఆటగాడు ఫ్రాన్సిస్ టియాఫొ, పదో సీడ్ అలగ్జాండర్ బబ్లిక్ కూడా ముందంజ వేశారు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ సబలెంక.. 6-4, 6-1తో టియాంట్సొవ సారా (ఫ్రాన్స్)పై ఈజీగా గెలిచింది. ఆమెకు ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. ఏడో సీడ్ జైస్మిన్ పౌలిని (ఇటలీ).. 6-1, 6-2తో సస్నొవిచ్ (బెలారస్)పై నెగ్గింది. బ్రిటన్ అమ్మాయి ఎమ్మా రడుకాను.. 6-4, 6-1తో మనంచయ (థాయ్‌లాండ్)ను చిత్తుచేసింది. అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్.. 7-6 (5/7), 3-6, 4-6తో డనిలొవిక్ (సెర్బియా) చేతిలో ఓటమిపాలైంది. కాగా ఈ టోర్నీ మహిళల సింగిల్స్ చరిత్రలో ఆడిన అత్యంత పెద్ద వయస్కురాలి (45 ఏండ్లు)గా వీనస్ రికార్డులకెక్కింది.