Gongadi Trisha | కౌలాలంపూర్: గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ పోరులో త్రిష (59 బంతుల్లో 110 నాటౌట్, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) 53 బంతుల్లోనే శతకం బాది ఈ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్‌గా తన పేరును రికార్డుల పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. త్రిషతో పాటు మరో ఓపెనర్ కమిలిని (42 బంతుల్లో 51, 9 ఫోర్లు) మెరవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం ఛేదనలో భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్.. 14 ఓవర్లలోనే 58 పరుగులకు చాపచుట్టేయడంతో టీమ్ఇండియా 150 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయూషి శుక్లా (4/8), వైష్ణవి శర్మ (3/5) ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో నిలవనీయలేదు. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన త్రిష.. (3/6) బంతితోనూ మెరిసి ఆల్‌రౌండ్ షోతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకుంది. ఈనెల 31న జరిగే తొలి సెమీస్‌లో భారత్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో రాణిస్తున్న త్రిష.. గత రెండు మ్యాచ్‌లలో 40+ స్కోర్లతో రాణించింది. అయితే ప్రత్యర్థి జట్లు కనీసం పోరాడే స్కోరు (ఇప్పటిదాకా ఈ టోర్నీలో భారత్‌తో తలపడిన ప్రత్యర్థి జట్లేవీ కనీసం 70 పరుగుల టార్గెట్‌ను కూడా నిర్దేశించలేదు)ను కూడా మన ఎదుట నిలపకపోవడంతో ఆమె భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం లేకపోయింది. కానీ స్కాట్లాండ్తో మ్యాచ్‌లో టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేయడం త్రిషకు కలిసొచ్చింది. ఆరంభం నుంచే మైదానంలో బౌండరీల వర్షం కురిపించిన త్రిష.. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసింది. మరో ఎండ్‌లో కమిలిని కూడా దూకుడగా ఆడటంతో భారత స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. తొలి వికెట్‌కు ఓపెనింగ్ జోడీ 13.3 ఓవర్లలో 147 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జతచేసింది. ఆ తర్వాత కమిలిని నిష్క్రమించినా త్రిష దూకుడు తగ్గలేదు. మరో రెండు ఓవర్లు ఉండగానే త్రిష శతకం పూర్తవడంతో భారత్ ఈ టోర్నీ చరిత్రలో రికార్డు స్కోరు చేసింది.
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించి సత్తాచాటిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు హృదయపూర్వక అభినందనలు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష..భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం. మున్ముందు మరింత రాణించి తెలంగాణ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలువాలి.
-సీఎం రేవంత్‌రెడ్డి
త్రిష ప్రదర్శన గర్వకారణం. మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన త్రిషకు ప్రత్యేక అభినందనలు. 110 పరుగుల సూపర్ సెంచరీతోపాటు మూడు వికెట్లు తీయడం చిరస్మరణీయ ప్రదర్శన
– మాజీ మంత్రి హరీశ్‌రావు