బ్యాంకాక్: పారా ఆర్చరీ ప్రపంచ సిరీస్‌లో భారత ఆర్చర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ ఫైనల్లో యువ సంచలనం పాయల్ నాగ్ 139-136 తేడాతో భారత్‌కే చెందిన స్టార్ ఆర్చర్ శీతల్దేవిపై అద్భుత విజయం సాధించింది. ఆద్యం హోరాహోరీగా సాగిన పోరులో పాయల్..శీతల్‌కు దీటైన పోటీనిస్తూ పసిడి పతకాన్ని ముద్దాడింది. తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టోర్నీ ఆడుతున్న పాయల్ ఒత్తిడిని చిత్తుచేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. చివరిదాకా ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
మరోవైపు పురుషుల కాంపౌండ్ ఫైనల్లో తోమన్కుమార్ 146-142తో జొనాథన్ మిల్నెపై గెలిచి స్వర్ణం దక్కించుకోగా, రికర్వ్‌లో భావ్న పసిడి సొంతం చేసుకుంది. పురుషుల రికర్వ్ ఫైనల్లో హర్విందర్‌సింగ్ రజతానికి పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా టోర్నీని భారత్ ఏడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచింది.