Ambati Rayudu: ఆంధ్రా ఆటగాడు, కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు తన మాజీ జట్టు ముంబై ఇండియన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కంటే తనకు చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడటమే బాగుందని అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ ‘ది రణ్వీర్ షో’లో మాట్లాడుతూ రాయుడు ఈ కామెంట్స్ చేశాడు. ముంబై తరఫున ఎనిమిది సీజన్లు ఆడినా తనకు మాత్రం చెన్నై తరఫున ఆడినప్పుడు కలిగిన అనుభూతి వేరని తెలిపాడు.
రాయుడు మాట్లాడుతూ.. ‘నేను ముంబై తరఫున 8 సీజన్లు ఆడాను. నా ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టిందే ముంబైతో.. అది చాలా గొప్ప ప్రయాణం. అప్పుడు నేను మూడు ఐపీఎల్ ట్రోఫీలు, రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాం. అక్కడ నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ముంబైని వీడి చెన్నైకి రావడం మరింత స్పెషల్. కానీ అప్పటిదాకా బ్లూ జెర్సీతో ఉన్న నేను.. చెన్నైకి మారాక ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో యెల్లో ప్యాడ్స్ కట్టుకుని వాళ్లమధ్య గడపడం కాస్త విచిత్రంగా అనిపించింది. అప్పుడు నాకు నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం కళ్లముందు గిర్రున తిరిగేది. అక్కడ మేం ఏం చేసేవాళ్లం అనేది గుర్తొచ్చేది. కానీ సీఎస్కేకు మారాక కొన్ని రోజులకే నేను పూర్తిగా ఇక్కడి నీళ్లు వంటబట్టించుకుని టీమ్‌తో కలిసిపోయా..’ అని చెప్పాడు. ఇదే షోలో రాయుడు.. చెన్నై జట్టుకు ధోనీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ అయితే బాగుంటుందని తెలిపాడు.
Ambati Rayudu on Ruturaj Gaikwad 💛
📸 – [TRS CLIPS] pic.twitter.com/T64FpfLypN
— Yash (@CSKYash_) November 25, 2023
రాయుడు తన కెరీర్లో 2010 నుంచి 2017 మధ్యలో ముంబైకి ఆడాడు. ఈ క్రమంలో అతడు ముంబై సాధించిన మూడు ఐపీఎల్ ట్రోఫీలలో భాగమయ్యాడు. ఆతర్వాత 2018 ఐపీఎల్ వేలంలో చెన్నైకి మారాడు. చెన్నైలో ఉండగా కూడా రాయుడు మూడు ట్రోఫీలను సొంతం చేసుకోవడం గమనార్హం. ఐపీఎల్లో 203 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4,348 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ 22 అర్థ శతకాలున్నాయి. 13 ఏండ్ల తన ఐపీఎల్ కెరీర్‌కు గతేడాది రాయుడు వీడ్కోలు ఇచ్చాడు.