Hassan Sardar : హాకీ వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో గెలిచిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ హసన్ సర్ధార్ ప్రశంసలు కురిపించాడు. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలోని టీమిండియా ప్రధాన జట్లకు ఏమాత్రం తీసిపోదని అతను అభిప్రాయపడ్డాడు. ‘హాకీలో గోల్ కొట్టడమనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం భారత జట్టుకు గోల్ స్కోర్ చేయగల సత్తా ఉంది. అంతేకాదు ఈ జట్టు చాలా పరిణితితో, విజయమే లక్ష్యంగా ఆడుతోంది. ఈ టీమ్ పతకాలు కొల్లగొట్టగలదు. ఈ టోర్నీలో ఆడుతున్న నాలుగు ప్రధాన జట్లు అయిన ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్, భారత్ మధ్య పెద్ద తేడా ఏం లేదు’ అని సర్దార్ అన్నాడు. 1970, 80ల్లో పాక్ జట్టులో సర్దార్ కీలక ఆటగాడు. ముంబైలో 1982లో జరిగిన వరల్డ్ కప్లో 11 గోల్స్ చేశాడు.
స్వదేశంలో జరుగుతున్న హాకీ వరల్డ్ కప్లో భారత పురుషుల జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో 2-0తో స్పెయిన్పై ఘన విజయం సాధించింది. అమిత్ రోహిదాస్, హార్ధిక్ సింగ్ గోల్ చెరొక గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్కు మూడు పాయింట్లు లభించాయి. తర్వాతి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది.