అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్‌లో గోవా చాలెంజర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం చివరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌పై గెలిచిన గోవా తొలిసారి యూటీటీ టైటిల్ ముద్దాడింది.
పుణె: భారత స్టార్ ప్యాడర్ హర్మీత్ దేశాయ్ దుమ్మురేపడంతో అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) నాలుగో సీజన్లో గోవా చాలెంజర్స్ చాంపియన్‌గా నిలిచింది. పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గోవా 8-7తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో హర్మీత్‌తో పాటు.. ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత అల్వారో రోబెల్స్ సత్తాచాటాడు. తొలి టైటిల్ నెగ్గిన గోవా చాలెంజర్స్‌కు ట్రోఫీతో పాటు రూ. 75 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
రన్నరప్ చెన్నైకి రూ. 50 లక్షల నగదు బహుమతి లభించింది. తుదిపోరులో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత టాప్ ర్యాంకర్ హర్మీత్ 2-1 (6-11, 11-4, 11-8)తో బెనెడిక్ట్ పై గెలిచి శుభారంభం చేయగా.. తదుపరి పోరులో నెగ్గిన చెన్నై స్కోరు సమం చేసింది. మూడో మ్యాచ్‌లో సీనియర్ ప్యాడ్లర్ ఆచంట శరత్ కమల్ సత్తాచాటడంతో చెన్నై ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రెండో సింగిల్స్ మ్యాచ్‌లో రోబెల్స్ 3-0 (11-8, 11-8, 11-10)తో శరత్‌పై నెగ్గడంతో గోవా పోటీలోకి వచ్చింది. చివరి పోరులో రీత్ రిష్య రాణించడంతో గోవా ట్రోఫీ కైవసం చేసుకుంది.