CWC | న్యూఢిల్లీ: ఎన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా.. తనపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు ఎందుకు కుమ్మరిస్తాయో మ్యాక్స్‌వెల్ మరోసారి నిరూపించాడు. లెంగ్త్ బాల్‌కు స్ట్రయిట్ డ్రైవ్.. స్లోవర్ బాల్‌కు అప్పర్ కట్, ఆఫ్ స్టంప్ బయటి బంతికి రివర్స్ స్లాప్, నేరుగా వచ్చిన బంతికి స్వీచ్ హిట్, కాస్త పక్కకు పోయిందంటే రివర్స్ స్వీప్ ఇలా క్రీజులో శివతాండవమాడిన మ్యాక్సీ.. ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన శతకం తన పేరిట లిఖించుకుంటే.. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెగాటోర్నీలో ఆరో సెంచరీతో నయా రికార్డు నెలకొల్పాడు. కంగారూల ఊచకోత ముందు డచ్ బౌలర్లు తేలిపోగా.. లక్ష్యఛేదనలో ముందే చేతులెత్తేసిన డచ్..ఆసీస్ ఆధిపత్యానికి దాసోహం అంది. వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యంత భారీ విజయంతో కంగారూలు నాలుగో స్థానానికి దూసుకెళ్లారు.
ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. స్పిన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి సెంచరీతో చెలరేగితే.. డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (71; 9 ఫోర్లు, ఒక సిక్సర్), లబుషేన్ (47 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో మెరిశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 4, బాస్ డీ లీడ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఒకదశలో 267/5తో ఉన్న ఆసీస్ అంత భారీ స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే చివరి 10 ఓవర్లలో మ్యాక్స్‌వెల్ విధ్వంసకాండ రచించడంతో ఆ జట్టు 131 పరుగులు ఖాతాలో వేసుకుంది. అనంతరం కొండంత లక్ష్యఛేదనలో డచ్ జట్టు 21 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) టాప్ స్కోరర్ కాగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జాంపా 4, మిషెల్ మార్ష్ రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇది క్రికెటేనా!
ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ షార్ట్ బాల్ దొరికితే మరే ప్లేయర్ అయినా.. పాయింట్ మీదుగా కట్ చేసి పరుగులు రాబడతాడు.. కానీ మ్యాక్స్‌వెల్ లాంటి ముదురు మాత్రం దానికి రివర్స్ స్లాపింగ్తో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ప్రేక్షకుల్లో పడేశాడు. ఈ ఒక్క షాట్ అనే కాదు. అసలు రివర్స్ స్వీప్ ఏదో, స్వీచ్ హిట్ ఏదో అని ఆలోచించుకునే లోపే మరో పిడుగు లాంటి షాట్.. దాన్ని ఆస్వాదిద్దామనుకునేసరికి మెరుపులాంటి మరో షాట్.. ఇలా ఢిల్లీలో డచ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిన మ్యాక్స్‌వెల్ వన్డే ప్రపంచకప్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. సాధారణంగా ఒక మంచి ఇన్నింగ్స్ నమోదైతే.. దాని గురించి చదివినా చూసినట్లే అనిపిస్తుంది. కానీ, మ్యాక్సీ దంచుడు మాత్రం దానికి పూర్తిగా భిన్నం! ఏబీ డివిలియర్స్ పూనినట్లు, తనకు మాత్రమే సాధ్యం అన్నట్లు.. అతడు బాదిన బాదుడు చూసి తీరాల్సిందే!!
వరల్డ్‌కప్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద (309) జయం. ఓవరాల్‌గా ఆసీస్‌కు ఇదే అత్యుత్తమం.
వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో (40) సెంచరీ చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డుల్లోకెక్కాడు. మార్క్మ్ (49 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (115) సమర్పించుకున్న బౌలర్‌గా బాస్ డీ లీడ్ నిలిచాడు.
ఆస్ట్రేలియా తరఫున వన్డే క్రికెట్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గానూ మ్యాక్స్ చరిత్ర లిఖించాడు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో వార్నర్ (6) రెండో స్థానానికి చేరాడు. ఈ మ్యాచ్‌లో శతకం ద్వారా సచిన్ టెండూల్కర్ (6) సరసన నిలిచాడు. రోహిత్ (7) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ తరఫున వార్నర్ టాప్కు చేరాడు. పాంటింగ్ (5) రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. ఈ రెండూ తాజా ప్రపంచకప్‌లోనే నమోదయ్యాయి. పాకిస్థాన్‌తో పోరులో వార్నర్, మార్ష్ శతక్కొట్టగా.. ఈసారి వార్నర్, మ్యాక్స్‌వెల్ ఆ బాధ్యత తీసుకున్నారు
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 399/8 (మ్యాక్స్‌వెల్ 106, వార్నర్ 104; వాన్ బీక్ 4/74), నెదర్లాండ్స్: 21 ఓవర్లలో 90 ఆలౌట్ (విక్రమ్ 25; జాంపా 4/8, మార్ష్ 2/19).

19