ముంబై : భారత క్రికెట్ పండుగ ఐపీఎల్లో 2026 సీజన్‌కు ముందు నిర్వహించబోయే మినీ వేలానికి సంబంధించి స్లాట్లు, పాల్గొనబోయే ఆటగాళ్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈనెల 16న అబుదాబిలో జరుగబోయే ఈ వేలానికి 77 స్లాట్స్ అందుబాటులో ఉండగా వీటికోసం ఏకంగా 1,355 మంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నవంబర్ 30న ఆటగాళ్లు వేలంలో తమ పేరును నమోదుచేసుకునే డెడ్‌లైన్ ముగియడంతో తాజాగా ఈ జాబితా విడుదలైంది.
వేలంలో 1,355 మంది ప్లేయర్లు బరిలో ఉండగా వారిలో 1,062 మంది భారతీయులు కాగా 293 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. 77 స్లాట్స్‌లో విదేశీ ప్లేయర్లకు 31 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వేలంలో పేర్లు నమోదుచేసుకున్నవారిలో భారత్ నుంచి ఏకంగా 928 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. రూ. 2 కోట్ల కనీస ధరలో ఉన్నవారిలో 45 మంది ఉండగా వీరిలో టీమ్ఇండియా నుంచి రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్ మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మయాంక్, సర్ఫరాజ్, పృథ్వీ షా, ఆకాశ్ దీప్ వంటి పేరున్న ఆటగాళ్లు వేలంలో ఉన్నా వారి కనీస ధర ఇంకా ఖరారుకాలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నుంచి పలువురు ప్రముఖ క్రికెటర్లు రూ. 2 కోట్ల జాబితాలో అధికంగా ఉన్నారు. కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, జెమీ స్మిత్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కే అవకాశముంది. రిటెన్షన్లు ముగిసిన తర్వాత పది ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్లు ఉండగా అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 64.30 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ. 43.40 కోట్లు వేలంలో ఆటగాళ్ల కోసం పోటీపడే అవకాశముంది.
ఈ లీగ్‌లో తనదైన మెరుపులతో అలరించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈసారి వేలం ప్రక్రియ నుంచి తప్పుకున్నాడు. 13 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న మ్యాక్సీ.. గత రెండు సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేదు. 2025లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతూ 7 మ్యాచ్‌ల్లో 48 పరుగులే చేసి బంతితో 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ సీజన్లో మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు అనాసక్తిగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు వేలానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తున్నది.