హైదరాబాద్, ఆట ప్రతినిధి : జిల్లాల్లోని క్రికెటర్ల భవిష్యత్తు, వర్ధమాన క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించేందుకు తెలంగాణకు ప్రత్యేక క్రికెట్ సంఘాన్ని ఇవ్వాలని బీసీసీఐని శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ క్రికెట్ సంఘానికి అసోసియేట్ సభ్యుత్వ సాధన కోసం వచ్చేనెల 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా ముంబైలోని బోర్డు హెడ్ క్వార్టర్స్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. ‘హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జంట నగరాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎన్నో ఏండ్లుగా గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం జరుగుతోంది.
హెచ్‌సీఏ స్టేట్ టీమ్స్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్ర క్రికెటర్ల ప్రయోజనాల కోసం సెప్టెంబర్ 18న బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా ధర్నాకు దిగుతాం. గ్రామీణ క్రికెటర్ల కోసం కలిసివచ్చే అందరూ బీసీసీఐ కార్యాలయం ముట్టడికి మద్దతుగా నిలిచి, ముంబైకి తరలిరావాలి’ అని వెంకటేశ్వర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.