న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో జర్మనీ ఆటగాడు అలగ్జాండర్ జ్వెరెవ్‌కు చుక్కెదురైంది. మూడో సీడ్‌గా టోర్నీ బరిలో నిలిచిన జ్వెరెవ్.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో 6-4, 6-7 (7/9), 4-6, 4-6తో 25వ సీడ్ కెనడా ఆటగాడు ఫెలిక్స్ అగర్ అలిఅస్సీమ్ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఫెలిక్స్ 2021 తర్వాత ఈ టోర్నీ నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు. తొలి సెట్‌ను దూకుడుగా గెలుచుకున్న జ్వెరెవ్.. రెండో సెట్ వరకు మ్యాచ్‌ను తన నియంత్రణలోనే ఉంచుకున్నాడు.
కానీ రెండో సెట్ టైబ్రేక్‌లో కెనడా కుర్రాడు పుంజుకుని దానిని సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ నుంచి జ్వెరెవ్ చేసిన తప్పిదాలను తనకు అనుకూలంగా మలుచుకున్న ఫెలిక్స్.. ఎక్కడా తప్పటడుగు వేయకుండా వరుస సెట్లను నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్).. 7-6 (7/2), 6-4తో అన్నా కలిన్సయ (రష్యా)ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరింది.
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ, మైఖెల్ వీనస్ (న్యూజిలాండ్) ద్వయం.. 6-0, 6-3తో మార్కొస్ గిరొన్, లర్నర్ టైన్ (అమెరికా) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.