హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 15 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ట్రీసా జాలీతో కలిసి భారత్‌కు మహిళల డబుల్స్‌లో చారిత్రక కాంస్య పతకం అందించిన హైదరాబాద్ యువ షట్లర్ పుల్లెల గాయత్రి దేశంలో అమ్మాయిల డబుల్స్‌కు మరింత ప్రోత్సాహం లభించాల్సిన అవసరం ఉందని అంటోంది. గతంలో సింగిల్స్ ఆడినప్పటికీ డబుల్స్‌లోకి మారడమే తమ ఇద్దరి కెరీర్లో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని చెప్పింది. ‘లాక్డౌన్ సమయం వరకూ నేను సింగిల్స్ బాగానే ఆడేదాన్ని. ఆ తర్వాత డబుల్స్ ప్రారంభించాం. ఇప్పుడు నా స్నేహితులైన చాలామంది సింగిల్స్ ప్లేయర్లు ఐదేండ్ల ముందే డబుల్స్‌కు మారి ఉంటే బాగుండేదని అంటుంటారు. సరైన సమయంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.
డబుల్స్‌లో కెరీర్ ఉండదనే అపోహ చాలామందిలో ఉంది. కానీ సాత్విక్-చిరాగ్, ధ్రువ్-తనీషా వంటి వారి విజయాలతో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి’ అని గాయత్రి పేర్కొంది. ఇక, మ్యాచ్‌ల సమయంలో తన తండ్రి,కోచ్ పుల్లెల గోపీచంద్ కోర్టు వెనుక కూర్చోవడం తమకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపింది. తనను గుడ్డిగా నమ్ముతామని, ఏం చెబితే అది చేస్తామని వెల్లడించింది. ఇక, ఫిట్నెస్ విషయంలో తండ్రే తనకు స్ఫూర్తి అని గాయత్రి చెప్పింది. ఇంట్లో సరికొత్త వర్కౌట్ మిషన్ ఉందని, సినిమా చూస్తున్న సమయంలో కూడా గోపీ హఠాత్తుగా లేచి పుషప్స్, స్క్వాట్స్ చేస్తూ ఉంటాడని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చారిత్రక విజయాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ తమ తదుపరి టార్గెట్ ఆసియా గేమ్స్ అని గాయత్రి చెప్పింది. వచ్చే నెలలో జరిగే ఆసియా గేమ్స్ కోసం వెంటనే సన్నాహకాలు ప్రారంభించి, పతక లక్ష్యం వైపు దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.