న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. పురుషుల జట్టుకు చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో ఆ బాధ్యతలను గంభీర్ చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో కోల్‌కతా టీమ్‌కు మెంటర్ పాత్రను సక్సెస్‌ఫుల్‌గా పోషించిన గంభీర్‌కు ఆ అవకాశం దక్కే ఛాన్సు ఉన్నది. గంభీర్‌తో పాటు ఫ్లెమింగ్, ఆండీ ఫ్లవర్ కూడా తొలుత రేసులో ఉన్నారు. కానీ తాజా అంచనాల ప్రకారం గంభీర్‌కే ఆ బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టు ఇచ్చిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నది. దీంతో ఆ జట్టుకు మెంటర్‌గా ఉన్న గంభీర్ గురించి అందరూ డిస్కస్ చేయడం ప్రారంభించారు. ఫైనల్ ముగిసిన తర్వాత కూడా బీసీసీఐ కార్యదర్శి జే షాతో గంభీర్ చాలాసేపు చర్చించినట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగిందో స్పష్టంగా తెలియదు. కానీ ఓ ఆంగ్ల పత్రిక మాత్రం రాహుల్ ద్రావిడ్ స్థానంలో గంభీర్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు స్టోరీ రాసింది. జాతీయ జట్టుకు కోచ్‌గా చేసిన అనుభవం గంభీర్‌కు లేకున్నా.. ఐపీఎల్లో మెంటర్ పాత్రను పోషించిన తీరు బట్టి అతనికి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు కట్టబెడుతారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కోచ్ పదవి కోసం మే 27వ తేదీన బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. సుమారు మూడు వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దాంట్లో సచిన్, మోదీ, అమిత్ షా లాంటి ఫేక్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థుల జాబితాను బోర్డు త్వరలో ఇంటర్వ్యూ చేయనున్నది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరగనున్నది.