లండన్ : భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ హాట్‌హాట్‌గా సాగుతున్నది. ఇరు జట్ల ప్లేయర్లు ఇప్పటికే నువ్వెంత అంటే నువ్వెంత అన్న తరహాలో మాటల తూటాలతో రెచ్చిపోతుంటే తాజాగా మరో వివాదం సిరీస్‌కు ఆజ్యం పోసింది. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ టెస్టును అద్భుత పోరాటపటిమతో డ్రా చేసుకున్న టీమ్ఇండియా సిరీస్ ఆశలను నిలుపుకుంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందుకోసం మంగళవారం టీమ్ఇండియా కియా ఓవల్ మైదానంలో ప్రాక్టీస్‌కు వచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్న గిల్‌సేన ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌ను డ్రా చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌పై సిరీయస్‌గా దృష్టి పెట్టిన భారత క్రికెటర్లు ఓవల్ మైదానంలో చెమటోడ్చారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. సాధారణంగా మ్యాచ్‌కు ముందు ఆయా జట్లకు కేటాయించిన ప్రాక్టీస్ పిచ్‌లపై సాధన చేస్తాయి. ఓవల్ మైదానంలో ఏర్పాటు చేసిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో ఏర్పాట్లపై టీమ్ఇండియా చీఫ్‌కోచ్ గౌతం గంభీర్‌కు స్టేడియం చీఫ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడి వచ్చిన ఫోర్టిస్ ప్రధాన పిచ్ దగ్గరకు 2.5 మీటర్ల దూరంలో ఉండమంటూ ఆదేశించడం వివాదానికి కారణమని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మీడియా భేటీలో పేర్కొన్నాడు. ప్రధాన పిచ్ దగ్గరగా వెళ్లవద్దని చెప్పడంపై తాము ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదని కోటక్ స్పష్టం చేశాడు. అయితే ఫోర్టిస్ వ్యవహారశైలిపై చిర్రెత్తుకొచ్చిన గంభీర్ అతని వైపు వేలు చూపిస్తూ ‘మేము ఏం చేయాలో నువ్వు చెప్పనక్కరలేదు’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్న క్రమంలో అక్కడే ఉన్న సితాంశు కోటక్ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు. ఫోర్టిస్‌ను అక్కడి నుంచి పక్కకు తీసికెళ్లి సర్దిచెపుతున్న క్రమంలో గంభీర్ మళ్లీ కలుగజేసుకున్నాడు. దీనిపై ఫిర్యాదు చేస్తానన్న ఫోర్టిస్ మాటలకు గంభీర్ కోపంతో ఊగిపోయాడు. ‘వెళ్లు ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకోపో. నువ్వు మాకు చెప్పనక్కరలేదు. నువ్వు సాధారణ గ్రౌండ్స్మెన్వి అంతే. అంతకుమించి ఏం లేదు’ అంటూ గంభీర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీరి మధ్య జరుగుతున్న వివాదాన్ని అక్కడే ఉన్న సహాయక కోచ్‌లు డస్కటె, మోర్నీ మోర్కెల్ చూస్తూ ఉండిపోయారు. ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత గంభీర్ రూమ్‌కు వెళ్లిపోగా, ఫోర్టిస్ స్పందిస్తూ ‘ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. అతను(గంభీర్) ఒకింత కోపంగా ఉన్నాడు’ అంటూ వ్యాఖ్యానించాడు.
కీలకమైన ఐదో టెస్టు కోసం టీమ్ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో కొంత మంది విశ్రాంతి తీసుకోగా, మరికొందరు సిరీయస్‌గా ప్రాక్టీస్ చేశారు. సిరీస్ డ్రా చేయాలనుకుంటే మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొన్నది. నాలుగో టెస్టులో అంతగా ఆకట్టుకోలేకపోయిన శార్దుల్ ఠాకూర్‌తో పాటు యువ పేసర్ అన్శుల్ కంబోజ్ను తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్‌సింగ్ ఫుల్ ఫిట్నెస్తో కనిపించగా, గాయం నుంచి తేరుకున్నట్లు కనిపించిన ఆకాశ్‌దీప్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. సింగ్‌కు తోడు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ ప్రాక్టీస్‌లో బిజీగా గడిపాడు. రెగ్యులర్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ స్థానంలో తుది జట్టులోకి రానున్న ధృవ్ జురెల్ రాక దాదాపు ఖరారైంది. ప్రాక్టీస్ సెషన్లో జురెల్‌కు గంభీర్ సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే శార్దుల్ స్థానంలో కుల్దీప్, అన్షుల్‌కు బదులుగా ఆకాశ్‌దీప్, అర్ష్దీప్సింగ్లో ఎవరో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఇంతకుమించి భారీ మార్పులేమి ఉండకపోవచ్చు. మాంచెస్టర్ టెస్టులో సెంచరీలతో రాణించిన గిల్, జడేజా, సుందర్‌తో పాటు బుమ్రా, సిరాజ్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు.