IND Vs SA | కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మూడోరోజు భారత జట్టు ఘోర పరాజాయాన్ని చవిచూసింది. తొలి రెండురోజుల్లో మ్యాచ్ భారత్‌కు అనుకూలంగా ఉండగా.. మూడోరోజు ఒక్కసారిగా మలుపు తిరిగి ఒక్కసారిగా జట్టు కుప్పకూలింది. 124 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఓటమి తర్వాత, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ టీమ్ మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘వైట్‌బాల్ క్రికెట్లో అద్భుతంగా ఉన్నాం. కానీ, ఈ రకమైన ప్రణాళికలో మనం అత్యుత్తమ టెస్ట్ జట్టుగా చెప్పుకోలేం. సెలక్షన్లో స్పష్టత లేకపోవడం, అతి వ్యూహాత్మక ఆలోచన జట్టును దెబ్బతీస్తోంది. గతేడాదిలో టెస్ట్ క్రికెట్లో ఫలితాలు నిరాశ పరిచాయి’ అంటూ వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నారు. కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను నేరుగా విమర్శలు గుప్పించారు. గంభీర్ కోచ్ అయ్యాక భారత టెస్ట్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా జట్టులో మార్పులు చేస్తున్నారని.. ఇది స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తున్నట్లుగా ప్రసాద్ విమర్శించారు.
తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ సమయంలో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మెడ గాయంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. కేవలం మూడు బంతులు మాత్రమే ఆడాడు. గిల్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. జట్టు బ్యాటింగ్ ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా.. జట్టు కెప్టెన్ లేకపోవడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాలో స్పిన్నర్లు చెలరేగారు. సైమన్ హార్మన్ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. తొలి, రెండో సెషన్లలో నాలుగు చొప్పున వికెట్లు కూల్చాడు. కేశవ్ మహరాజ్ సైతం రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దాంతో భారత్ కష్టాల్లోపడింది. స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్ కుదురుకోకుండా ఇబ్బంది పెట్టారు. దాంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్‌లో 91/7తో కష్టాల్లో ఉండగా.. కెప్టెన్ టెంబా బావుమా 55 పరుగులతో అజేయంగా నిలువడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో బావుమా ఇన్నింగ్స్ కీలకమైంది. బావుమాను భారత బ్యాట్స్‌మెన్‌లో కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.