న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం కోబి బ్రయాంట్ లోకాన్ని వీడి రెండేండ్లు గడిచినా అతడిపై ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు. అతడి వస్తువులను వేలం వేస్తే కండ్లు చెదిరే ధర పలుకుతున్నాయి. నిరుడు బ్రయాంట్కు చెందిన జెర్సీ రూ. 28 కోట్లకు అమ్ముడుపోగా.. అంతకుముందు ఓ టవల్ కూడా భారీ ధర పలికింది. దీంతో ఈసారి బ్రయాంట్కు చెందిన మరో జెర్సీని వేలానికి అందుబాటులో ఉంచారు. 1996-97 సీజన్లో బ్రయాంట్ ధరించిన జెర్సీని ఈనెల 18 నుంచి ఆన్లైన్ వేలంలో ఉంచనున్నట్లు ఆక్షన్ నిర్వాహకుడు డేవిడ్ కోహ్లర్ తెలిపాడు. ‘ఇది బాస్కెట్బాల్ జెర్సీల్లో రికార్డు ధర పలుకుతుందని భావిస్తున్నా’ అని డేవిడ్ పేర్కొన్నాడు. మూడు నుంచి ఐదు మిలియన్లకు పైగా ధర పలుకుతుందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. 2020 జనవరిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్ దుర్మరణం పాలయ్యాడు. అదే ఘటనలో అతడి కుమార్తె గియానా కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే.