Gabba Stadium : ఆస్ట్రేలియాలోని ప్రధా స్టేడియాల్లో ఒకటైన గబ్బా అంటే చాలు క్రికెట్ జట్లు వణికిపోతాయి. ఆ మైదానం ఆసీస్‌కు కంచుకోట లాంటిది. అక్కడ కంగారులను ఓడించిన జట్లు కొన్నే. నాలుగేళ్ల క్రితం టీమిండియా సంచలన విజయంతో చరిత్రను తిరగరాసింది. అలాంటి గబ్బా మైదానం త్వరలోనే నేలమట్టం కానుంది. స్వదేశంలో జరుగనున్న 2032 ఒలింపిక్స్ అనంతరం గబ్బాను కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళవారం క్వీన్స్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిష్ఠాత్మకమైన గబ్బాను పూర్తిగా కూలగొట్టడానికి కారణం ఏంటో తెలుసా..?
క్వీన్స్లాండ్ ప్రభుత్వం గబ్బా స్టేడియాన్ని 1895లో నిర్మించింది. అప్పట్నుంచీ ఈ మైదానం దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియం నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. దాంతో, స్టేడియం కొంత భాగం శిథిలావస్థలో ఉంది. ఆటగాళ్ల భద్రత, స్టేడియం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూల్చివేయడమే పరిష్కారమని అధికారులు అనుకుంటున్నారు. 2032లో ఒలింపిక్స్ పోటీల తర్వాత.. గబ్బా కనుమరుగు కానుంది. ఆ తర్వాత నుంచి జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లు విక్టోరియా పార్క్ ప్రాంతంలోని మైదానంలో జరుగనున్నాయి. విశ్వ క్రీడల కోసం 63 వేల సీట్ల సామర్థ్యంతో అక్కడ కొత్త మైదానం నిర్మిస్తున్నారు.
The end of an era: The Gabba will be demolished: https://t.co/8OGklgG9qc pic.twitter.com/onlcc4pWmb
— cricket.com.au (@cricketcomau) March 25, 2025
‘విక్టోరియాలో కొత్త మైదానం నిర్మిస్తున్నాం. 63 వేల మంది సామర్థ్యంతో రూపొందుతున్న ఈ స్టేడియంలో సకల సౌకర్యాలు కల్పిస్తాం. 2032 తర్వాత గబ్బాలో జరగాల్సిన మ్యాచ్‌లను విక్టోరియా పార్క్‌లోని స్టేడియంలో నిర్వహిస్తాం. విశ్వక్రీడల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బంగారు పతకం గెలుపొంది.. గబ్బాకు వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నాం. కొత్త స్టేడియం నిర్మాణానికి ముందుకొచ్చిన క్వీన్స్లాండ్ ప్రభుత్వానికి క్రీడాభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో వెల్లడించింది.