హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈనెల 5 నుంచి స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో వాలీబాల్ లీగ్ తొలి సీజన్ మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో లీగ్ నిర్వాహకులు సోమవారం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లీగ్ అధికారిక జెర్సీ, బంతిని ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘లీగ్ ఆతిథ్యానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. టోర్నీకి సంబంధించి అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, పీవీఎల్ సీఈవో జాయ్ భట్టాచార్య, ప్రతినిధులు తుహిన్ మిశ్రా, యశ్వంత్, అభిషేక్‌రెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్న లీగ్‌లో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.