పారిస్: ఆధునిక టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ మహారాణులుగా వెలుగొందుతున్న టాప్ సీడ్స్ అరీనా సబలెంక, ఇగా స్వియాటెక్ (పోలండ్) మధ్య సమరంలో బెలారస్ భామదే పైచేయి అయింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వియాటెక్ వరుస విజయాల జోరుకు బ్రేకులేస్తూ సబలెంక ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఒకటో సీడ్ సబలెంక.. 7-6 (7/1), 4-6, 6-0తో ఐదో సీడ్ స్వియాటెక్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఫిలిప్పీ చార్టర్ వేదికగా సుమారు రెండు గంటల 20 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సబలెంక జోరు ముందు స్వియాటెక్ తేలిపోయింది. ఆరంభ సెట్లో 4-1తో వెనుకబడ్డ స్వియాటెక్ ఆ తర్వాత పుంజుకుని 6-7 స్కోరు చేయడంతో టైబ్రేక్ అవసరమైంది. టైబ్రేక్‌లో స్వియాటెక్ పాచిక పారలేదు. కానీ రెండో సెట్లో పోలండ్ అమ్మాయి 6-4తో దూకుడు పెంచడంతో మ్యాచ్ మూడో సెట్‌కు దారితీసింది.
నిర్ణయాత్మక మూడో సెట్లో సబలెంక.. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా దక్కకుండా మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఈ ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్‌లో 26 విజయాల స్వియాటెక్ విజయాల పరంపరకు బ్రేక్ పడగా వరుసగా నాలుగో టైటిల్ గెలవాలన్న ఆమె ఆశలపైనా నీళ్లు చల్లినైట్టెంది. కాగా గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లో స్వియాటెక్‌పై సబలెంకకు ఇదే తొలి గెలుపు కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆరో సీడ్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-3, 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించి సెమీస్ చేరాడు. సెమీస్‌లో అతడు ఇటలీ స్టార్ యానిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు.