ఆర్లింగ్టన్ (యూఎస్ఏ) : సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో అత్యంత కీలక ఘట్టం ఆసన్నమైంది. 48 జట్లతో మొదలైన టోర్నీలో మిగిలిన నాలుగు జట్లు సెమీస్ సమరానికి రెడీ అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీస్‌లో బలమైన ఫ్రాన్స్, స్పెయిన్ తలపడనున్నాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్.. యూరోపియన్ చాంప్ స్పెయిన్ ను ఢీకొట్టనుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ మధ్య పోరు అభిమానులకు అసలైన మజా అందించనుంది.
గత ఎడిషన్‌లో కొద్దిలో ట్రోఫీ చేజార్చుకున్న ఫ్రాన్స్ ఈసారి ఎలాగైనా కప్పు నెగ్గాలన్న కసితో అసాధారణ ఆటతీరును కనబరుస్తోంది. ఆ జట్టు ఎటాకింగ్ విభాగం అద్భుత ఫామ్‌లో ఉంది. కెప్టెన్ ఎంబాపె ఐదు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఉస్మాన్ డెంబెలే 5 గోల్స్ సాధించగా, మైఖేల్ ఒలిసే ఐదు అసిస్ట్‌లతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే వరుసగా మూడుసార్లు ఫైనల్ చేరిన రెండో యూరోపియన్ జట్టుగా ఫ్రాన్స్ రికార్డు సృష్టిస్తుంది. మరోవైపు, స్పెయిన్ బలమైన డిఫెన్స్, కంట్రోల్‌తో కూడిన ఆటతీరుతో దూసుకుపోతోంది. ఈ టోర్నీలో ఒకే ఒక్క గోల్ క్వార్టర్స్‌లో బెల్జియంకు ఇచ్చుకుంది. రోడ్రి, పెద్రి, డాని ఓల్మో వంటి ఆటగాళ్లతో మిడ్‌ఫీల్డ్ బలంగా కనిపిస్తోంది.