అల్ ఖోర్: డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్.. ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఫ్రాన్స్.. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో 2-1తో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్ తరఫున అరెలిన్ చౌమెని (17వ నిమిషంలో), ఒలీవర్ గిరాడ్ (78వ ని.లో) చెరో గోల్ సాధించగా.. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్ (54వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. తొలి అర్ధభాగంలో చౌమెని గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ అదే జోరు కొనసాగిస్తూ.. మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేయగా.. ద్వితీయార్ధంలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని ఇంగ్లండ్ సారథి కేన్ సద్వినియోగ పరుచుకున్నాడు. ఫలితంగా స్కోరు సమం కాగా.. అక్కడి నుంచి ఇరు జట్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు తీవ్రతను పెంచాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ మరో గోల్ నమోదు చేసుకోగా.. 84వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని కేన్ గోల్‌గా మలచలేకపోయాడు. దీంతో ఫ్రాన్స్ జయకేతనం ఎగరవేసింది. లీగ్ దశలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే.. కీలక పోరులో సహచరులు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పదే పదే ఇంగ్లండ్ రక్షణ శ్రేణిని బోల్తా కొట్టిస్తూ అవకాశాలు సృష్టించాడు. బుధవారం అర్ధరాత్రి జరుగనున్న సెమీఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.