Laxman Sivaramakrishnan : భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ (Laxman Sivaramakrishnan) కామెంటేటర్ కెరీర్‌ను ముగించాడు. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా తన స్టయిల్ క్రికెట్ కామెంటరీతో అలరించిన ఆయన అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. జాత్యహంకారం కారణంగానే తాను కామెంటరీ రంగం నుంచి వైదొలుగుతున్నట్టు మాజీ లెగ్ స్పిన్నర్ వెల్లడించాడు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన ఎక్స్ పోస్ట్‌ల రూపంలో పంచుకున్నాడు.
ప్రపంచ క్రికెట్లో జాతి వివక్ష గురించి విన్నాం. కామెంటేటరీ ఫీల్డ్‌లోనూ వివక్ష ఉందంటున్నాడు భారత మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్. సుదీర్ఘకాలం కామెంటేటర్‌గా కొనసాగిన ఆయన .. నాపై వివక్ష చూపించారు. అందుకే తాను బీసీసీఐ కామెంటేటర్‌గా వైదొలుగుతున్నా అని ఎక్స్ పోస్ట్‌లో తన ఆవేదనను వెల్లడించారు.
My retirement is nothing great. But a story of tv production unfolds. Soon you will see the bigger picture
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 20, 2026
‘టాస్ విధులు, మ్యాచ్ అనంతరం ప్రజంటేషన్ వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు నన్ను తీసుకునేవారు కాదు. ఇరవై ఏళ్ల అనుభవం ఉన్నా కూడా నన్ను పరిగణించకపోవడం బాధించేది’ అని ఆయన తెలపాడు. అందుకు ‘బహుశా మీరు నల్లగా ఉండడం ఒక కారణం కావచ్చు’ అని ఒక యూజర్ అనగా.. ‘అవును మీరు చెప్పింది నిజం. వర్ణ వివక్షకు గురయ్యాను’ అని ఆయన బదులిచ్చాడు.
‘నేను వీడ్కోలు పలకడం పెద్ద విషయం కాదు. కానీ, ప్రొడక్షన్, బాధ్యతల కేటాయింపులో వివక్ష వెలుగులోకి రావడం చాలా ముఖ్యం. త్వరలోనే మీకు పూర్తిగా నిజానిజాలు తెలుస్తాయి’ అని 60 ఏళ్ల శివరామకృష్ణన్ పేర్కొన్నాడు. 1980ల్లో లెగ్ స్పిన్నర్‌గా భారత విజయాల్లో కీలకమైన శివరామకృష్ణన్ 9 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 26, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.