Syed Abid Ali | భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అబిద్ అలీ బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. మాజీ ఆల్‌రౌండర్ భారత్ తరఫున 29 టెస్టు మ్యాచులు ఆడారు. ఈ మీడియం పేస్ బౌలర్ 47 వికెట్లు పడగొట్టారు. భారత క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా నిలిచారు. 1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అబిద్ అరంగేట్రం చేశారు. 55 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్ల పడగొట్టి అత్తుమ గణాంకాలను నమోదు చేశారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించారు. వికెట్ల మధ్య చురుగ్గా కదిలేవారు. అలాగే, బెస్ట్ ఫీల్డర్‌గా నిలిచారు. అబిద్ అలీ 1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 55 పరుగులు చేసిన ఆయన.. సిక్సర్‌తో తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించారు.
1958–59లో హైదరాబాద్ జూనియర్ జట్టు తరపున ఆడిన అబిద్, ఆ తర్వాత సంవత్సరం రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యారు. ఆ సంవత్సరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ ఎంఏకే పటౌడి స్థానంలో ఆడి, రెండు ఇన్నింగ్స్‌లలో 33 పరుగులు చేశాడు. 55 పరుగులకు 6 వికెట్లు తీశారు. మూడో టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 47 పరుగులు చేయగా.. అదే సిరీస్ ఆఖరి టెస్టులో 81, 78 పరుగులు చేశాడు. 1971లో జరిగిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ భారత జట్టును గెలిచిన సందర్భంలో అబిద్ నాన్ స్ట్రయికర్‌గా ఉన్నారు. సిరీస్ చివరి టెస్టులో వెస్టిండీస్ గెలుస్తుందనుకున్న సమయంలో అబిద్ వరుస రెండు బంతుల్లో రోహన్ కన్హాయ్, గ్యారీ సోబర్స్‌లను బౌల్డ్ చేశారు.. 1975 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగులు చేశారు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 29 మ్యాచులు ఆడిన ఆయన.. 1,018 పరుగులు చేశాడు. ఐదు వన్డేల్లో 93 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యుత్తమ స్కోర్ 81, వన్డేల్లో 70. టెస్టుల్లో 47 వికెట్లు తీయగా.. వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలు 55 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు. ఇక వన్డేల్లో 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. రంజీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తరఫున అబిద్ అలీ 2వేల పరుగులు చేసి వంద వికెట్లు తీశారు. 1968-69లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కేరళపై 173 నాటౌట్, 1974లో ఓవల్‌లో సర్రేపై ఉత్తమ బౌలింగ్ 23 పరుగులకు 6 వికెట్లు తీశాడు. 1980లో కాలిఫోర్నియాకు వెళ్లే ముందు అబిద్ కొన్ని సంవత్సరాలపాటు హైదరాబాద్ జూనియర్ జట్టుకు శిక్షణ ఇచ్చారు. 1990 చివరలో మాల్దీవులకు, 2001-02లో రంజీ ట్రోఫీలో సౌత్ జోన్ లీగ్ గెలిచిన ఆంధ్రా జట్టుకు, 2002-2005 మధ్యకాలంలో యూఏఈ జట్టుకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ.. స్టాన్ఫోర్డ్ క్రికెట్ అకాడమీలో యువకులకు శిక్షణ ఇస్తున్నారు.