న్యూఢిల్లీ: జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులోకి మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ దూసుకొచ్చాడు. చేతన్‌శర్మ వైదొలుగడంతో ఖాళీ అయిన చైర్మన్ పదవి కోసం అగార్కర్ పోటీపడబోతున్నాడు. ఇందుకోసం ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ పదవి నుంచి అగార్కర్ గురువారం తప్పుకున్నాడు. వాస్తవానికి 2021లోనే సెలెక్షన్ కమిటీలో చోటు కోసం ప్రయత్నించిన అగార్కర్‌కు చేతన్‌శర్మ రూపంలో చుక్కెదురైంది.
నార్త్‌జోన్ నుంచి శర్మ ప్రాతినిధ్యం వహించడంతో ఈ ముంబైకర్ సెలెక్షన్ కమిటీలోకి రాలేకపోయాడు. ఇప్పుడు నార్త్‌జోన్ నుంచి పోటీలేకపోవడంతో అగార్కర్ లైన్ క్లియర్ కావచ్చు. ఇన్ని రోజులు ఐపీఎల్లో ఢిల్లీకి సహాయక కోచ్‌గా వ్యవహరించడంతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అగార్కర్..ఇప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవిపై కన్నేశాడు. ఇదిలా ఉంటే చైర్మన్ పోస్ట్‌కు కోటి రూపాయలు, కమిటీ సభ్యులకు 90 లక్షల వేతనాన్ని పెంచేందుకు బీసీసీఐ ఆలోచిస్తున్నది. కొత్తగా కొలువుదీరే సెలెక్షన్ కమిటీ రానున్న వెస్టిండీస్ టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనుంది.