సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(Damien Martyn).. కోమాలోకి వెళ్లారు. 54 ఏళ్ల వయసున్న ఆ మాజీ బ్యాటర్.. బాక్సింగ్ డే రోజున కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మెనింజిటిస్ వ్యాధితో బాధపడుతున్న అతను క్వీన్స్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరపున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం డేమియన్ మార్టిన్‌కు ఇండ్యూస్డ్ కోమా పద్ధతిలో చికిత్స అందిస్తున్నారు. ఆసీస్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మార్టిన్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని, ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు.
1992 నుంచి 2006 మధ్య కాలంలో ఆస్ట్రేలియా తరపున డామియన్ మార్టిన్ 67 టెస్టులు ఆడాడు.2000 సంవత్సరంలో ఆరేళ్ల గ్యాప్ తర్వాత అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. స్టీవ్ వా నేతృత్వంలోని ఆసీస్ జట్టులో అతను కీలక బ్యాటర్‌గా కొనసాగాడు. 2006 యాషెస్ సిరీస్ మధ్యలో అతను అకస్మాత్తుగా రిటైర్ అయ్యాడు. టెస్టుల్లో అతను 46 సగటుతో 4406 పరుగులు చేశాడు. దీంట్లో 13 సెంచరీలు ఉన్నాయి. 2003లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. ఆ జట్టులో మార్టిన్ ఉన్నాడు. ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మార్టిన్ 88 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్‌తో కలిసి 234 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డేల్లో డామియన్ మార్టిన్ 40 సగటుతో 5346 రన్స్ చేశాడు. దీంట్లో అయిదు సెంచరీలు ఉన్నాయి.