భోపాల్: భారత క్రికెటర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్( Shashank Singh)పై .. మధ్యప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇంట్లో పనిమనిషిగా చేరిన విపేంద్ర సింగ్ అనే వ్యక్తిని కొట్టినట్లు ఫిర్యాదు నమోదు చేశారు. క్రికెటర్ శశాంక్‌తో పాటు అతని తండ్రి శైలేష్ సింగ్, మరో వ్యక్తిపై కూడా కేసు బుక్ చేశారు. జూన్ 25వ తేదీన క్రికెటర్ ఇంట్లో కుక్‌గా చేరినట్లు బాధితుడు విపేంద్ర సింగ్ తెలిపాడు. ఇంట్లో ఉన్న వారి ప్రవర్తన నచ్చక అక్కడ పనిచేయడానికి నిరాకరించినట్లు చెప్పాడు. కానీ తన ఫోన్ లాక్కుని, దుర్భాషలాడారన్నాడు. క్రికెటర్ శశాంక్‌తో పాటు అతని డ్రైవర్ తనను కొట్టినట్లు చెప్పాడు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే తొలుత వాళ్లు నిరాకరించారని, కానీ మెడికల్ టెస్టులతో వెళ్లిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నాడు. ఈ ఘటన పట్ల క్రికెటర్ శశాంక్ మాట్లాడుతూ తామేమీ బాధిత వ్యక్తిని బంధీగా ఉంచలేదన్నారు. కుక్ అని చెప్పి ఇంట్లో పనికి వచ్చాడని, కానీ అతనికి ఏమాత్రం వంట చేయడం రాదు అని, ఇంట్లో వీడియోలు, ఫోటోలు తీసేవాడని, తన రూమ్‌లోకి కూడా వెళ్లినట్లు శశాంక్ తెలిపాడు.కేవలం సరదా కోసం అతను పనిలో చేరాడని, కానీ అదృష్టవశాత్తు ఇంట్లో వస్తువుల్ని కోల్పోలేదన్నారు. ఆ వ్యక్తి ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలను తన తల్లి డిలీట్ చేయించిందన్నారు.