ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరువైంది. టైటిల్ వేటలో మేటి జట్లు ఒక్కొక్కటి వైదొలుగగా మిగిలిన నాలుగు జట్లు కప్ కోసం కదనోత్సాహంతో ఉన్నాయి. కలల కప్‌ను కైవసం చేసుకునే క్రమంలో అదృష్టం కలిసిరాక స్టార్ ప్లేయర్లు రొనాల్డో, నెయ్మర్ కన్నీటితో నిష్క్రమించగా, మెస్సీ ముందంజ వేశాడు. వరుస విజయాలతో దూసుకెళుతున్న అర్జెంటీనా..పోరాటానికి పెట్టింది పేరైన క్రొయేషియాతో సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. సాకర్ మాంత్రికుడు మారడోనా తర్వాత అర్జెంటీనాకు ప్రపంచకప్ సాధించిపెట్టాలన్న పట్టుదలతో మెస్సీ..కనిపిస్తుంటే ఒకసారైనా కప్‌ను ముద్దాడాలన్న కసి మోడ్రిచ్ నేతృత్వంలోని క్రొయేషియాలో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మెస్సీ, మోడ్రిచ్ మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో 32 జట్ల పోరు కాస్తా..నాలుగు జట్లకు చేరింది. లీగ దశ నుంచి మొదలుపెట్టి, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో టైటిల్ ఫేవరెట్లు అన దగ్గ బ్రెజిల్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్, ఉరుగ్వే ఇంటి ముఖం పట్టగా అర్జెంటీనా, క్రొయేషియా, మొరాకో, ఫ్రాన్స్ మిగిలాయి. ఇంకా మూడే మూడు మ్యాచ్‌ల ద్వారా ఫుట్‌బాల్ ప్రపంచ విజేత ఎవరో తేలిపోనుంది. తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఖతార్ ఇందుకు వేదిక కాబోతున్నది. తొలి సెమీఫైనల్ విషయానికొస్తే రెండు సార్లు విజేత అర్జెంటీనా..క్రొయేషియాతో పోరుకు సిద్ధమైంది. విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో తలపడేందుకు ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డే ఆస్కారం కనిపిస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) 12.30 గంటలకు లుసైల్ స్టేడియంలో సెమీస్ పోరుకు తెరలేవనుంది.
ఫిఫా ప్రపంచకప్‌లో క్రొయేషియా పోరాట స్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా క్రొయేషియా గెలుస్తున్న తీరు అద్భుతమని చెప్పాలి. నాకౌట్ మ్యాచ్‌ల్లో గురితప్పని షూటౌట్లో ఆరితేరిన క్రొయేషియన్లు..అర్జెంటీనా జోరుకు బ్రేక్‌లు వేయాలని చూస్తున్నారు. 40 లక్షల జనాభా కల్గిన క్రొయేషియా..పోరాడుతున్న తీరు అందరి మన్ననలు పొందుతున్నది. లుకా మోడ్రిచ్ రూపంలో ఆ జట్టుకు బలమైన మిడ్‌ఫీల్డర్ ఉండటం కలిసిరానుంది. ప్రిక్వార్టర్స్‌లో జపాన్, క్వార్టర్స్‌లో బ్రెజిల్‌ను మట్టికరిపించిన క్రొయేషియా.. అర్జెంటీనాను అడ్డుకునేందుకు సమాయత్తం అవుతుంది.
సెమీస్‌కు చేరిన ఇరు జట్ల ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే 36 ఏండ్లుగా అర్జెంటీనా ప్రపంచకప్ విజేతగా నిలిచేందుకు చకోర పక్షిలా నిరీక్షిస్తూనే ఉన్నది. 1978, 86లో రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మరోమారు కప్‌ను ముద్దాడలేకపోయింది. దిగ్గజ డిగో మారడోనాకు ఘనమైన
నివాళి అందించాలన్న పట్టుదలతో ఉన్న మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అందుకు తగ్గట్లు ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ మెగాటోర్నీలో దూసుకెళుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో 1-2తో ఓటమి మినహాయిస్తే వరుస విజయాలతో మెస్సీసేన కప్ వేట కొనసాగిస్తున్నది. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ను ఉత్కంఠభరిత షూటౌట్లో ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న అర్జెంటీనా..నాకౌట్ కింగ్‌గా వెలుగొందుతున్న క్రొయేషియాకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నది. 35 ఏండ్ల మెస్సీకి ఇది చివరి ప్రపంచకప్‌గా భావిస్తున్న నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా మారనుంది.