FIFA World Cup 2026 | ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఫిఫా (FIFA) వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఫుట్బాల్ ప్రేమికులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాలను అభిమానులు ఎలాంటి అంతరాయం లేకుండా ఆస్వాదించడానికి వీలుగా బెంగళూరు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) చేసిన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఫిఫా సెమీ ఫైనల్స్ జరిగే జూలై 15, 16 తేదీలతో పాటు, గ్రాండ్ ఫైనల్ రోజైన జూలై 20న బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తమ సేవలను కొనసాగించవచ్చు. మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాల (లైవ్ స్క్రీనింగ్) కోసం రాత్రి 1:00 గంట నుండి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆహార సేవలను (Food Services) పొడిగించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫుట్బాల్ అభిమానుల సౌకర్యార్థం తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ వినోదాన్ని ఆస్వాదించే క్రమంలో ప్రజల భద్రత, శాంతిభద్రతలు, మరియు పౌరుల సౌకర్యానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఫుట్బాల్ అభిమానులంతా ఎంతో బాధ్యతాయుతంగా మ్యాచ్లను వీక్షించాలని, నగరంలో శాంతిభద్రతలను కాపాడటంలో అధికారులకు మరియు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.
Football inspires millions across the world, and the FIFA World Cup is a celebration that fans eagerly look forward to. Following a request from the National Restaurant Association of India, our government has permitted hotels and restaurants in Bengaluru to extend food service…
— DK Shivakumar (@DKShivakumar) July 14, 2026