FIDE Chess World Cup : ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ వరల్డ్ కప్ (FIDE Chess World Cup) పోటీల్లో భారత గ్రాండ్‌మాస్టర్లకు షాక్‌లు తగులుతున్నాయి. వరుస ఓటములతో వరల్డ్ కప్ విజేత దివ్యా దేశ్‌ముఖ్ (Divya Deshmukh) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh) పోరాటం కూడా ముగిసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన గుకేశ్ అనూహ్యంగా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. గుడ్‌న్యూస్ ఏంటంటే.. ప్రజ్ఞానంద(R Praggnanadhaa), ఎరిగేసి అర్జున్(Arjun Erigaisi)లు నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లారు.
భారీ అంచనాలతో చెస్ వరల్డ్ కప్ బరిలో నిలిచిన గుకేశ్ పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. శనివారం జర్మనీ గ్రాండ్‌మాస్టర్ ఫ్రెడెరిక్ స్వానే చేతిలో 1.5 -0.5తో భారత స్టార్ కంగుతిన్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అతడు ఆఖర్లో భటువుకు దూరంగా రాజును తీసుకెళ్లి పెద్ద పొరపాటు చేశాడు. అంతే.. ఫ్రెడెరిక్ తన వ్యూహాన్ని అమలు చేసి గుకేశ్ ఆట కట్టించాడు. మరోవైపు యువకెరటం అర్జున్ ప్రత్యర్థి షంసిద్దిన్ విఖిదోవ్పై 1.5-0.5తో, రాబర్ట్ హొవ్హన్నిస్యాన్పై 1.5-0.5 తో విజయంతో ప్రజ్ఞానంద నాలుగో రౌండ్ చేరుకున్నారు.
Frederik Svane 🇩🇪 stuns the World Champion! Gukesh D 🇮🇳 is out of the FIDE World Cup! #FIDEWorldCup pic.twitter.com/OvCJFdOoik
— International Chess Federation (@FIDE_chess) November 8, 2025
ఫిడే చెస్ వరల్డ్ కప్ పోటీలకు దాదాపు 23 ఏళ్ల తర్వాత మనదేశం ఆతిథ్యమిస్తోంది. గోవా వేదిక జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో 82 దేశాల నుంచి 206 మంది పోటీపడుతున్నారు. ఎనిమిది రౌండ్లలో గెలుపొందిన వారు నాకౌట్‌కు అర్హత సాధిస్తారు. ఆనావాయితీ ప్రకారం టాప్ -50లో ఉన్న క్రీడాకారులు నేరుగా రెండో రౌండ్ ఆడుతున్నారు. ప్రతి రౌండ్లో రెండు ఫార్మాట్లలో గేమ్ నిర్వహించనున్నారు. స్కోర్లు సమం అయినప్పుడు టై బ్రేకర్స్ ఆడిస్తారు. ఈ టోర్నీ విజేతకు రూ.17 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.