Max Verstappen : రేసింగ్ ట్రాక్‌పై పాతికేళ్ల కుర్రాడు మాక్స్ వెర్‌స్టప్పెన్(Max Verstappen) దూకుడు చూపిస్తున్నాడు. ఈ రెడ్ బుల్ డ్రైవర్(Red Bull Driver) వరుసగా 10 టైటిళ్లతో ఫార్ములా వన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఈరోజు ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్(Italian Grand Prix) ఫైనల్లో విజేతగా నిలిచాడు. దాంతో, గతంలో ఎఫ్ 1 స్టార్ సెబాస్టియన్ వెల్లెట్(Sebastian Vettel) 9 విజయాలతో నెలకొల్సిన రికార్డును బద్ధలు కొట్టాడు. సెబాస్టియన్ 2013లో ఈ ఫీట్ సాధించాడు.
ఆదివారం రేసు ముగిశాక మ్యాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మరొక గెలుపు.. అంతేకాదు మరింత విలువైనది. అయితే.. ఇదంతా సాధ్యమవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ, మనం ఇలాంటి రోజు కోసం ఎంతో కష్టపడాలి. అప్పుడు కచ్చితంగా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అని పాతికేళ్ల మాక్స్ అన్నాడు.
సెబాస్టియన్ వెల్లెట్, మాక్స్ వెర్‌స్టప్పెన్
ఈ ఏడాది ఇప్పటికే రెండు వరల్డ్ చాంపియన్‌షిప్స్ గెలిచిన మాక్స్ వెర్‌స్టప్పెన్ మరో చాంపియన్‌షిప్‌పై కన్నేశాడు. ఈ సీజన్లో ఈ యంగ్‌స్టర్ 14 రేసుల్లో పాల్గొన్నాడు. 12 పోటీల్లో విజయం సాధించాడు. మాక్స్ రెడ్‌బుల్ సహచరుడు సెర్గియో పెరెజ్( Sergio Perez) మిగతా రెండింటిలో విజేతగా నిలిచాడు. ఈరోజు జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్(Italian Grand Prix) ఫైనల్లో పెరెజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.