Asia Cup | భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ భారత జట్టుకు ఆయన విజ్ఞప్తి చేశాడు. ‘‘భారత జట్టు ఈ మ్యాచ్ ఆడకూడదు. ఇది జరగకూడదనేది నా అభిప్రాయం మాత్రమే కాదు. నేను నమ్ముతున్న విషయం. భారత జట్టు ఎక్కడైనా పాకిస్థాన్‌ను ఓడించగలదు. కానీ, ఈ మ్యాచ్ అసలు జరగకూడదు’ అని జాదవ్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానుల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి.. ఆ తర్వాత భారత్ -పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని మాజీ ఆటగాళ్లు, అభిమానులు కలిసి బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. కేదార్ జాదవ్‌కు ముందు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా పలువురు మాజీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరుగనున్నది. బీసీసీఐ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది. భారత్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనున్నది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌పై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇండియా-పాకిస్థాన్ మధ్య రాజకీయంగా నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, 2027 వరకు ఇరు జట్లు న్యూట్రల్ వేదికలపై మాత్రమే మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే గత మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం వహించినప్పటికీ, భారత్ తమ మ్యాచ్‌లన్నిటిని దుబాయ్‌లోనే ఆడి, విజేతగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఒక దేశంగా.. మన దేశ భద్రత, సైనికుల ప్రాణాలు, జాతీయ గౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ఆ దేశంతో సాధారణ స్థాయిలో క్రీడలు జరుగడం భావోద్వేగపూరితంగా, నైతికంగా సరికాదని పలువురు పేర్కొంటున్నారు. క్రికెట్ వంటి ఆటలు దేశాల మధ్య పాజిటివ్ రిలేషన్స్‌ని పెంచగలవు అనేది వాస్తవమే. కానీ, ఉగ్రవాదానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మద్దతు ఇచ్చే దేశంతో సంబంధాలు కొనసాగించడాన్ని సామాన్య ప్రజలతో పాటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్రంగా వ్యతిరేకించడంలో అర్థం ఉందని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
అయితే ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కి ఇది ఒక ప్రతిష్టాత్మక పోరు. కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్‌ని చూస్తుంటారు. క్రికెట్‌ను పూర్తిగా రాజకీయానికి వేరుగా చూడాలన్న వాదనలు ఉన్నాయి. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఆ దేశంతో మ్యాచులు ఆడకూడదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్లోనూ టీమిండియా మాజీ ఆటగాళ్లతో కూడిన జట్టు పాకిస్తాన్‌తో ఆడేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ దేశంతో మ్యాచ్ ఆడేది లేదని యువరాజ్ సింగ్ నేతృత్వంలోని జట్టు తేల్చిచెప్పింది.