ముంబై: భారత క్రికెట్ జట్టుకు ధోనీ, రోహిత్ అనంతరం మూడో టీ20 ప్రపంచకప్ అందించిన సారథిగా రికార్డులకెక్కిన సూర్యకుమార్ యాదవ్.. తాను చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా మాత్రం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా సారథి (టీ20ల్లో)గా 80.76 శాతం సక్సెస్ రేట్ సాధించిన సూర్య.. దీనిని ఎలా ఆస్వాదిస్తున్నారు?
అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘వాస్తవానికి స్కూ ల్, కాలేజీలో ఉన్నప్పుడు నేను ఆ పర్సంటేజీని సాధించాలని అనుకునేవాడిని. కానీ అక్కడ నేనెప్పుడూ 50-60 శాతం దాటలేకపోయా. నా కుటుంబం నేను ఎక్కువగా చదవాలని కోరుకుంది. అయితే నేను ఆటను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలిచింది. అప్పుడు సాధించలేకపోయిన దానిని (80 శాతం సక్సెస్ రేట్) ఇప్పుడు ఆస్వాదిస్తున్నా’ అని అన్నాడు.