Asian Championships : ఒలింపిక్ విజేత మను భాకర్ (Manu Bhaker) మరో టోర్నీలో మెరిసేందుకు సిద్ధమవుతోంది. పారిస్ విశ్వక్రీడల్లో రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన మను 16వ ఎడిషన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకంతో మురిసిపోవాలనుకుంటోంది. కజకిస్థాన్ వేదికగా ఆగస్టులో జరుగబోయే ఈ మెగా ఈవెంట్లో రెండు విభాగాల్లో పోటీ పడనుందీ షూటర్. హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ (Esha Singh) 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో, పారిస్‌లో కాంస్యం గెలుపొందిన స్వప్నిల్ కుసాలే సత్తా చాటాలనుకుంటున్నారు. సోమవారం జాతీయ రైఫిల్ సంఘం ప్రకటించిన స్క్వాడ్‌లోని 35 మందిలో రెండు కేటగిరీల్లో బరిలోకి దిగనున్న ఏకైక షూటర్ మనునే కావడం విశేషం.
జాతీయ రైఫిల్ సంఘం సోమవారం ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 15 ఈవెంట్ల కోసం 35 మందిని ఎంపిక చేసింది. మూడు మిక్స్డ్ టీమ్ పోటీల్లోనూ భారత బృందం పాల్గొననుంది. మహిళల విభాగంలో మను కాకుండా ఒలింపియన్ అంజుమ్ మౌడ్గిల్(50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్), పురుషుల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. మిగతావాళ్లలో ఐశ్వర్య ప్రతాప్ సింగ్(0 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్), సౌరభ్ చౌదరీ(10 మీటర్ల ఎయిర్ పిస్టల్), కినన్ చెనాయ్ (మెన్స్ ట్రాప్)లు కూడా పతకంపై గెలిచే అవకాశాలున్నాయి. వీళ్లతో పాటు మెహులీ గోష్, కిరన్ జాదవ్ సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
STORY | Manu Bhaker headlines Indian shooting squad for Asian Championships
READ: https://t.co/HZNBQ23skd pic.twitter.com/sySW8gDf5s
— Press Trust of India (@PTI_News) July 7, 2025
పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన మను.. ఆ తర్వాత మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లోనూ కంచుమోత మోగించింది. ఒకే విశ్వక్రీడల్లో రెండు మెడల్స్ గెలిచిన షూటర్‌గా రికార్డు నెలకొల్పిన ఆమె ఈసారి ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అదిరే ప్రదర్శన చేయాలనుకుంటోంది. కజకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో మను మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో.. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకంపై గురి పెట్టింది.