David Lawerence : ఇంగ్లండ్ క్రికెట్ ఒక దిగ్గజ ఆటగాడిని కోల్పోయింది. పేసర్‌గా ఆ జట్టుకు చిరస్మరణీయ సేవలందించిన మాజీ పేసర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawerence ) కన్నుమూశాడు. అరుదైన మోటార్ న్యూరాన్ జబ్బు(Motor Nueron Disease)తో బాధపడుతున్న లారెన్స్ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. 2 ఏళ్లుగా ఎంన్డీతో పోరాడిన లారెన్స్ 61 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
మోటార్ న్యూరాన్ డిసీజ్ అనేది ప్రాణాంతకమైనది. ఇది ఆయుష్షను తగ్గించే ఒకరకమైన న్యూరలాజికల్ డిసీజ్. కండరాలను బలహీనం చేసే ఈ జబ్బు కొన్ని నెలల్లో తీవ్రంగా మారుతుంది. ఈ వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన 61 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. 1964 జనవరి 28న జన్మించిన లారెన్స్ గ్లౌసెస్టర్షైర్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 170 మ్యాచుల్లో 477 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు లారెన్స్.
పేస్ సంచలనంగా మారిన అతడు 1988లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 1992 మధ్య ఈ పేసర్ ఐదు టెస్టులు మాత్రమే ఆడాడు. కానీ, తన సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు లారెన్స్. 1991లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల ప్రదర్శన కనబరిచాడీ పేస్ గన్. ఆ మ్యాచ్‌లో డేంజరస్ వివ్ రిచర్డ్స్ వికెట్ తీసింది ఆయనే. ఆ టెస్టుతో ఒక్కసారిగా హీరో అయిన లారెన్స్ ఆశ్చర్యంగా ఆటకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ టెస్టు ఆడుతుండగా ఆయన మోకాలికి గాయమైంది. సర్జరీ అనంతరం లారెన్స్ ఆటకు దూరమయ్యాడు.
Former England and Gloucestershire fast bowler David ‘Syd’ Lawrence has died at the age of 61 following a battle with motor neurone disease.
Rest in peace, Syd. pic.twitter.com/mVmOnWrQPD
— ESPNcricinfo (@ESPNcricinfo) June 22, 2025
అయితే.. రెండేళ్ల క్రితం ఆయనకు ఎంఎన్డీ ఉన్నట్టు నిర్దారణ అయింది. దాంతో.. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దాంతో, చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు లారెన్స్. ‘మోటార్ న్యూరాన్ డిసీజ్‌తో పోరాడుతూ డేవిడ్ మరణించారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మైదానం వెలుపల ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన మనమధ్య లేరు. ఇవి మా కుటుంబానికి బాధాకరమైన క్షణాలు’ అని లారెన్స్ ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది.