లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్.. ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇంగ్లీష్ జట్టుకు పీడకలను మిగుల్చుతూ ఆ జట్టును టోర్నీ నుంచి పంపించింది. బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్.. 8 పరుగుల తేడాతో బట్లర్ సేనను ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇబ్రహీం జద్రాన్ (144 బంతుల్లో 177, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడగా అజ్మతుల్లా ఒమర్జయ్ (బ్యాట్‌తో 40, బంతితో 5/58)ఆల్‌రౌండ్ షోతో ఇంగ్లండ్‌ను ఇంటికి సాగనంపారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. జద్రాన్‌తో పాటు నబీ (24 బంతుల్లో 40, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగుల వద్దే ఆగిపోయింది. జో రూట్ (111 బంతుల్లో 120, 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకంతో మెరిసి లక్ష్యానికి చేరువగా వచ్చినా ఆఖర్లో ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. జద్రాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తాకాయి. ఓపెనర్ గుర్బాజ్ (6), సెదికుల్లా (4), రహ్మత్ (4) విఫలమవడంతో ఆ జట్టు 9 ఓవర్లలో 37 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. కానీ జద్రాన్ పోరాటం ఆ జట్టును నిలబెట్టింది. సారథి హష్మతుల్లా షాహిది (40)తో కలిసి నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించిన అతడు.. క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఓవర్టన్ 28వ ఓవర్లో 6, 4, 4తో నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్ గేర్ మార్చిన అతడు.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. లివింగ్స్టన్ 37వ ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసి వన్డేలలో ఆరో శతకం పూర్తిచేసుకున్నాడు. అజ్మతుల్లాతో కలిసి ఐదో వికెట్‌కు 72 పరుగులు జతచేసిన జద్రాన్.. శతకం తర్వాత మరింత దూకుడు పెంచాడు. ఆర్చర్ 44వ ఓవర్లో 6, 4, 4, 4 బాదాడు. మరో ఎండ్‌లో నబీ కూడా రూట్ 47వ ఓవర్లో 6, 6, 4 కొట్టడంతో అఫ్గాన్ 300 పరుగుల మార్కును చేరుకుంది.
భారీ ఛేదనలో ఇంగ్లండ్.. 4వ ఓవర్లోనే ఓపెనర్ సాల్ట్ (12) వికెట్ కోల్పోయింది. నబీ వేసిన ఏడో ఓవర్లో స్మిత్ (9) నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రూట్‌తో కలిసి డకెట్ (38) మూడో వికెట్‌కు 68 పరుగులు జతచేశాడు. కానీ రషీద్ 17వ ఓవర్లో డకెట్‌ను రషీద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బ్రూక్ (25) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ కెప్టెన్ బట్లర్‌తో కలిసి రూట్.. ఇంగ్లండ్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 83 రన్స్ జోడించారు. కానీ అజ్మతుల్లా 37వ ఓవర్లో బట్లర్ భారీ షాట్ ఆడబోయి రహ్మత్ షాకు క్యాచ్ ఇవ్వగా లివింగ్స్టన్ (10)ను గుల్బాదిన్ బోల్తా కొట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలిచిన రూట్.. ఐదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలలో శతకం పూర్తిచేశాడు. లివింగ్స్టన్ ఔట్ అయినా అతడి స్థానంలో వచ్చిన జెమీ ఓవర్టన్ (28 బంతుల్లో 32, 4 ఫోర్లు) అఫ్గాన్‌ను భయపెట్టాడు. గెలుపు దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌ను అజ్మతుల్లా వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. 46వ ఓవర్లో రూట్‌ను ఔట్ చేసిన అతడు.. 48వ ఓవర్లో ఓవర్టన్ను పెవిలియన్‌కు పంపాడు. 49వ ఓవర్లో ఫరూఖీ.. ఆర్చర్ (14)ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. కానీ చివరి ఓవర్లో అజ్మతుల్లా 4 పరుగులే ఇవ్వడంతో పాటు ఐదో బంతికి రషీద్ (5)ను ఔట్ చేయడంతో అఫ్గాన్ మరో చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది.
అఫ్గానిస్థాన్ తరఫున వన్డేలలో అత్యుత్తమ స్కోరు (177) చేసిన క్రికెటర్ జద్రాన్. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీలోనూ శతకం చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్ అతడే
చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు జద్రాన్దే. బెన్ డకెట్ (165) రికార్డు కనుమరుగైంది.
అఫ్గాన్: 50 ఓవర్లలో 325/7 (జద్రాన్ 177, నబీ 40, ఆర్చర్ 3/64, లివింగ్స్టన్ 2/58)
ఇంగ్లండ్: 49.5 ఓవర్లలో 317 ఆలౌట్ (రూట్ 120, బట్లర్ 38, అజ్మతుల్లా 5/58, నబీ 2/57)