IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగనున్నది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని కసితో ఉన్నది. కీలకమైన చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎలాగైనా వన్డేల్లో సత్తాచాటాలని ఇంగ్లాండ్ భావిస్తున్నది. నాగ్‌పూర్ వేదికగా జరుగున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడడం లేదని తెలిపాడు.
మోకాలి గాయంతో బాధపడుతున్నాడని.. అందుకే మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలిసారిగా యశస్వి జైస్వాల్‌తో పాటు హర్షిత్ రాణా టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ సందర్భంగా టీమ్ ఇద్దరికి క్యాప్‌ను అందించింది. హర్షిత్ రాణా ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకోవడంతో వన్డే జట్టులోనూ చోటు దక్కింది.
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్‌తో వన్డేల్లో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత గాయం కారణంగా చాలాకాలం క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డేల్లో అవకాశం దక్కింది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న వన్డే తుదిజట్టులో టీమ్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీ బంతితో రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆకాంక్షిస్తున్నది.
ఇంగ్లాండ్ జట్టు : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.