సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ (2019) అందించిన ఇయాన్ మోర్గాన్.. త్వరలోనే క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నాడు. ఇండియాతో జులై 7 నుంచి ప్రారంభం కాబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కంటే ముందే అతడు కెప్టెన్సీ పగ్గాలతో పాటు ఆటగాడిగా కూడా క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడని సమాచారం.
‘ది గార్డియన్’ లో వచ్చిన సమాచారం ప్రకారం.. గత కొన్నాళ్లుగా ఫిట్నెస్, ఫామ్ లేమి కారణంగా ఇయాన్ మోర్గాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. టీ20లతో పాటు వన్డేలలో కూడా అతడు గత ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. దీంతో అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ఈ 36 ఏండ్ల క్రికెటర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. జులై మొదటి వారంలో అతడు ఈ నిర్ణయం వెల్లడించే అవకాశమున్నది.
వన్డేలలో మోర్గాన్ అనుకున్నంతగా రాణించడం లేదు. ఇటీవల ముగిసిన నెదర్లాండ్స్ వన్డే సిరీస్ లో వరుసగా రెండు మ్యాచులలో డకౌట్ అయ్యాడు. మూడో మ్యాచ్ లో గాయం కారణంగా అతడు ఆడలేదు. కాగా ఇంగ్లాండ్ వైట్ బాల్ (వన్డే, టీ20) జట్టుకు తదుపరి సారథిగా ప్రస్తుత వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ తో పాటు మోయిన్ అలీ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే రాబోయే ప్రపంచకప్ ల నేపథ్యంలో అలీ కంటే బట్లర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపనున్నారు.
ఇక ఇంగ్లండ్ తరఫున 248 వన్డేలు ఆడిన మోర్గాన్.. 7,701 పరుగులు చేశాడు. 114 టీ20లలో 2,458 రన్స్ చేశాడు. 16 టెస్టులు కూడా ఆడాడు. ఐపీఎల్ లో మోర్గాన్ కోల్కతా నైట్ రైడర్స్ కు సారథ్యం వహించాడు. కానీ ఈ ఏడాది వేలంలో అతడు అమ్ముడుపోలేదు.